‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
* బీజేపీ, శివసేనల మధ్య తొలగని ప్రతిష్టంభన
* ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లనున్న కమలనాథులు!
* బీజేపీకి మద్దతు నిర్ణయాన్ని సమర్థించుకున్న శరద్ పవార్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ ఇచ్చే బేషరతు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది స్పష్టం కావడం లేదు. ఒకప్పటి మిత్రులైన బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన కూడా తొలగలేదు. సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షాలను అభినందిస్తూ ఫోన్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. శివసేనను సస్పెన్స్‌లో ఉంచి ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశమివ్వాలని కోరాలని కాషాయదళం యోచిస్తోంది. తమది పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడిగే హక్కు తమకే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవిని తీసుకునేది తామేననన్నారు.
బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ప్రతిపాదనపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇప్పటికైతే చర్చించలేదన్నారు. తాము అన్ని మార్గాలను తెరిచే ఉంచామని బీజేపీ నేత ఓమ్ మాథుర్ చెప్పారు. తద్వారా సేన మద్దతిస్తే తీసుకోవడానికి సిద్ధమేనని చెప్పకనే చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో చర్చించారు. 288 స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 122, దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్షకు ఒకటి, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్కును సాధించాలంటే బీజేపీకి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
శివసేన సస్పెన్స్: మరోపక్క.. కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. అయితే బీజేపీతో 25 ఏళ్ల పొత్తు పునరుద్ధరణపై కానీ, బీజేపీకి మద్దతిచ్చే అంశంపై కానీ ఎలాంటి చర్చా జరగలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.
ఉత్తమ ప్రత్యామ్నాయం: పవార్
ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి బయటను నుంచి మద్దతిస్తామని ప్రకటించిన ఎన్సీపీ నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర ప్రధాన పార్టీల సీట్లను చూస్తే సుస్థిర ప్రభుత్వానికి అదే ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన బంధువు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత శరద్ పవార్ వారినుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత ఒకరు తనను ఫోన్లో సూచించారని అజిత్ పవార్ వెల్లడించారు.
అయితే మూడు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 146 కనుక ప్రభుత్వం స్థిరంగా ఉండదని చెప్పాననన్నారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని, వీటికి ఇతర చిన్న పార్టీలూ తోడైతే బీజేపీని అధికారానికి దూరంగా పెట్టగలవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ‘నేషనలిస్ట్ కరప్ట్ పార్టీ’ అని మోదీ విమర్శించిన ఎన్సీపీతో బీజేపీ ఎలా చేతులు కలుపుతుందని కాంగ్రెస్ నేత రణదీప్ దుయ్యబట్టారు.
ముందంజలో ఫడ్నవీస్
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. రద్దుకానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే, శాసనమండలి విపక్ష నేత వినోద్ థావ్డే, దివంగత పార్టీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ తదితరుల పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అమిత్, మహారాష్ట్రకు చెందిన గడ్కారీతో మంతనాలు జరపడంతో గడ్కారీ కూడా సీఎం రేసులోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పరిశీలించేందు పార్టీ నేత జేపీ నడ్డాతోపాటు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ సమావేశం కారణంగా సోమవారం ముంబై వెళ్లలేకపోయారు.