పొత్తుల కోసం ఆత్మగౌరవం బలిపెట్టం
పాత మిత్రపక్షం శివసేనతో పొత్తు విషయమై బీజేపీకి ఇంతవరకు స్పష్టత రాకపోయినా.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని బలిపెట్టి తాము పొత్తుల కోసం వెంపర్లాడబోమని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని కూలగొట్టాలంటే 'మహాకూటమి' బలంగా, ఐకమత్యంగా నిలవాలని ఆయన చెప్పారు.
ఈసారి మహారాష్ట్రలో వచ్చేది మాత్రం బీజేపీ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పారు. విమానంలో ముంబైనుంచి కొల్హాపూర్ వచ్చేటప్పుడు కూడా తాను బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తవాడేలకు పొత్తుల విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పానన్నారు. తాము గట్టిగా ప్రయత్నిస్తున్నా శివసేన నుంచి తగిన స్పందన లేదని వాళ్లు అన్నారని తెలిపారు. బీజేపీ రెండు అడుగులు ముందుకు వస్తుందని, శివసేన కూడా రెండు అడుగులు ముందుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.