షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కరద్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్‌లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు.