నాయకుడు లేని పార్టీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం వహించేందుకు బీజేపీకి నాయకుడెవరూ లేరని, తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆధారపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ఎన్నికల ప్రచారం అసాధారణమని పేర్కొన్నారు. ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రి కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని బహిరంగసభల్లో పాల్గొనలేదని చెప్పారు. ఇది బీజేపీకి ఉన్న బలహీనత అని చవాన్ మంగళవారం ఇక్కడ పలు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణంతో బీజేపీకి చెప్పుకోదగిన నాయకుడే లేకుండా పోయారని అన్నారు. ఆ బలహీనతను దాచేందుకు మోడీని రాష్ట్రమంతటా తిప్పుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ దురహంకారిగా మారిందని ఆరోపించారు. ప్రచారం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడుతో పాటు రాజస్థాన్, గోవా ముఖ్యమంత్రులను ప్రచారం చేసేందుకు పిలుస్తున్నారని అన్నారు. దీనిని బట్టి స్థానిక నాయకత్వంపై బీజేపీకి విశ్వాసం లేనట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముంగిట తన ప్రభుత్వానికి మద్దతునుపసంహరించిన ఎన్సీపీపై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా దొడ్డిదారిలో మోడీకి అధికారం అప్పగించేందుకు చేసిన కుట్ర అనిఅన్నారు. ఆచరణ సాధ్యం కాని షరతులను విధించడం వల్లనే ఎన్సీపీతో పొత్తు కుదేలైందని చవాన్ చెప్పారు. బీజేపీకి సహకరించేందుకు ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని ఆరోపించారు.
ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉన్నాం..: బీజేపీ నేతలు ఫడ్నవిస్,జవదేకర్
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ధులేలో జరిగిన పార్టీ ప్రచారసభలో తానున్నంత వరకు మహారాష్ట్రను ఎవరూ ముక్కలు చేయలేరనిప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం రాష్ట్రానికి చెందిన అదే పార్టీ నాయకులు ఇలా మాట్లాడడం విస్మయం కలిగించింది. మోడీ సభ అనంతరం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో జవదేకర్, ఫడ్నవిస్‌లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నరేంద్ర మోడీ చెప్పింది ముంబైని మహారాష్ట్ర నుంచి ఎవరు విడగొట్టలేరని చెప్పారని, ఆయన వ్యాఖ్య విదర్భ గురించి కాదని వారు వివరణ ఇచ్చారు.