కాంగ్రెస్, ఎన్సీపీలకు పదేసి సీట్లే!
ప్రధాని మోదీ జోస్యం
ఆ పార్టీలు మహారాష్ట్రను దోచుకున్నాయని ధ్వజం
పంధార్‌పూర్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు 15 ఏళ్ల పాలనలో మహారాష్ట్రను దోచుకున్నాయని దుయ్యబట్టారు. అందువల్ల రాష్ట్ర రాజకీయాల నుంచి ఆ పార్టీలను కనుమరుగు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పదేసి సీట్లకు మించి గెలవలేవని జోస్యం చెప్పారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలోని పంధార్‌పూర్, ఒస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లలో జరిగిన సభల్లో పాల్గొన్న మోదీ...ఎన్సీపీపై విమర్శలకు మరింత పదును పెట్టారు. ఎన్సీపీని నేచురల్లీ కరప్ట్ పార్టీ (అవినీతి సహజమైన పార్టీ)గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎన్సీపీకి మళ్లీ అధికారం అప్పగిస్తే ఆ పార్టీ మరింతగా అవినీతి కార్యకలాపాలు సాగిస్తుందని దుయ్యబట్టారు. ‘‘ఆ పార్టీ చిహ్నమైన గడియారానికి అర్థం ఏమిటో తెలుసా? ఆ గడియారంలో సమయం 10 గంటల 10 నిమిషాలు చూపుతోంది.
అంటే ఆ పార్టీ 10 రెట్లకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడినట్లు అర్థం. మళ్లీ ఆ పార్టీని గద్దెనెక్కిస్తే ఈసారి 15 రెట్లు అవినీతికి పాల్పడుతుంది’’ అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. 2014తో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ శకానికి తెరపడుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, రాష్ట్ర సంపదను దోచుకున్నాయని ఆరోపించారు.