టార్గెట్.. 165!
మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. మరికొన్ని గంటలు గడిస్తే అక్కడ పోలింగ్ కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో ఎన్నికలు అచ్చంగా రణరంగాన్ని తలపిస్తున్నాయి. అంతకుముందు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ.. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ.. ఈ రెండు కూటములూ విచ్ఛిన్నం కావడంతో అక్కడ బహుముఖ పోటీ కనిపిస్తోంది. దాంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరు అధికార పగ్గాలను చేపడతారోనన్న విషయం చెప్పడం చాలా కష్టంగా మారింది. అంతకుముందు బీజేపీ- శివసేన కూటమిగా ఉంటే మాత్రం వాళ్లు అధికారంలోకి రావడం ఖాయమని ఎన్నికల పండితులు నిక్కచ్చిగా చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ పాలనను ప్రజలు భరించలేకపోయారని, పూర్తిగా విసుగెత్తిపోయారని అన్నారు. అయితే.. సీట్ల పంపకం విషయంలో ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. దాంతో ఈ రెండు పక్షాలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఇలా ప్రధాన కూటమి విడిపోవడాన్ని సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్- ఎన్సీపీ కూడా మరోవైపు విడిపోయాయి. ఆ రెండు పార్టీలు కూడా అధికారం తమకు దక్కుతుందనే ఆరాటంతో విడివిడిగానే పోటీకి దిగాయి. దాంతో.. మొత్తం నాలుగు ప్రధాన పార్టీలు బరిలో నిలిచాయి.
ఏది ఎలా ఉన్నా.. మహారాష్ట్రలో అధికారం సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అక్కడ 165 స్థానాలు దక్కించుకోవాలని స్థానిక నాయకులకు టార్గెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే కావల్సిన మేజిక్ నెంబర్.. 145. అయితే, పొరపాటున అటూ ఇటూ అయితే ఇబ్బంది కలగకూడదని, అందువల్ల కనీసం 165 సీట్లు దక్కించుకుని కుర్చీలో కూర్చోవాలని మోదీ మహారాష్ట్ర బీజేపీ నేతలకు నిర్దేశించారు.
ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా.. గొంతు పూడిపోయినా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత చెక్పోస్టుల మీద భారీ స్థాయిలో కాల్పులు జరిపి, బాంబుదాడులు చేస్తున్న తరుణంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏంటని శివసేన లాంటి పార్టీలు ఎద్దేవా చేసినప్పుడు.. వాళ్లకు సమాధానం ఇవ్వాల్సింది తాను కాదని, జవాన్ల చూపుడువేళ్లే వాళ్లకు జవాబు చెబుతాయని అన్నారు. ఎవరి జాతకం ఏంటో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలంటే మాత్రం... ఆదివారం వరకు ఆగాల్సిందే!!