అవినీతిపరుల కోసమే సర్కారుకు మద్దతా?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన ఉలిక్కిపడింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తును తెంచుకున్న శివసేన.. తీరా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అనుకోకుండా ఎన్సీపీ నాయకులు బీజేపీవైపు మొగ్గు చూపడంతో తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీపై శివసేన మండిపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేకమంది అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని, అందులో ఎన్సీపీ ముందుందని చెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 22 స్థానాలు అవసరం. 41 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీ.. ఫలితాలు రాగానే తాము బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని తెలిపింది. కానీ బీజేపీ ఇంతవరకు దానిపై స్పందించలేదు.
శివసేనకు 63 స్థానాలు రావడం, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు శివసేన పెట్టే షరతులను అంగీకరించొద్దంటూ గట్టిగా పట్టుబట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ లాంటి నాయకులను ముఖ్యమంత్రి చేయడానికి శివసేన ఎంతవరకు అంగీకరిస్తుందన్నది కూడా అనుమానమే.
అవసరమైతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకుని.. అటు శివసేన, ఇటు ఎన్సీపీ రెండు పార్టీల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వాదనలు సైతం వచ్చాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో.. దీపావళి తర్వాతే ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అప్పటికి అందరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.