saamna
-
వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన
ముంబై: మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. కాగా, కోవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్‌కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది. ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది. "కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్‌డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. "స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్‌కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది" అని శివసేన విమర్శించింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది. -
సోషల్ మీడియా వేదికగా మతవిద్వేషం
ముంబై: సోషల్ మీడియా వేదికగా బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని వ్యాపింపచేస్తోందని శివసేన ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ గత ఎన్నికల్లో ఎంతో లాభపడటమే కాక.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. బీజేపీపై ఫేస్బుక్ చర్యలు తీసుకోకపోవడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫేస్బుక్ వేదికగా ఎవరైనా సరే దేశాన్ని విభజించడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో సంబంధం లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రాన కళ్లుమూసుకుని కూర్చోకూడదు’ అంటూ శివసేన తీవ్రంగా విమర్శించింది. (విద్వేషంపై ఉదాసీనత) అంతేకాక ‘బీజేపీ నాయకులు ఈ సోషల్ మీడియా వేదికలను సమాజాన్ని అనుసంధానించడానికి బదులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ వేదికలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెలుగుతాయి. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియా సైన్యం బీజేపీకి ఎంతో సహకరించింది. అందువల్లే మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది’ అని తెలిపింది. అంతేకాక ‘గత ఏడు సంవత్సరాలలో సత్యాన్ని వక్రీకరించి.. అబద్దాన్ని వాస్తవాలుగా చూపిస్తూ.. బహిరంగంగా ప్రచారం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు, పుకార్లు ప్రచారం చేశారని’ శివసేన ఆరోపించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద సోషల్ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్, జోకులు ప్రచారంలో ఉన్నాయని సామ్నా ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అదే వేదిక మీద మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శివసేన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) -
ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలకు ఆయన సరైన న్యాయం చేస్తున్నారని, విపక్షనేత పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని వ్యంగ్యంగా ఆకాశానికెత్తింది. అంతేకాకుండా కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఫడ్నవిస్ అభినందించారని, ఇది తమకు ఎంతో నైతిక బలనిచ్చిందని శివసేన సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం తన అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్‌ను ప్రచురించింది. (ఆపరేషన్ కమల్‌పై బీజేపీ క్లారిటీ) ‘దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ధైర్యంగా, డైనమిక్‌గా వ్యవహరించారు. తనకు కోవిడ్ పాజిటివ్ వస్తే... కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం తీసుకుంటా అని ప్రకటించడం చెప్పడం మంచి పరిణామం. ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లూ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థపై ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది’ అనిని శివసేన ఎడిటోరియ్లో పేర్కొంది. కాగా కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఫడ్నవిస్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసిన విషయం తెలిసిందే. -
పార్లమెంటును ఎందుకు నిర్వహిస్తున్నారు?
ముంబై : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ సోషల్ డిస్టేన్సింగ్ పాటించాలని ప్రధాని మోదీ ఓ పక్క విజ్ఞప్తి చేస్తూ మరోపక్క రాజకీయ కారణాలతో పార్లమెంటును నడిపిస్తున్నారని శివసేన ఆరోపించింది. ఈ మేరకు శివసేన తమ సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది. వేల మంది ఎంపీలు, అధికారులు, సిబ్బంది పార్లమెంటులో ఒక్క చోటికి వస్తున్నారని ఆ సంపాదకీయంలో రాసింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్యలకు మద్దతునివ్వడానికే పార్లమెంటు సెషన్ నడుస్తోందని ఆరోపించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే అన్నింటిని పూర్తిగా లాక్డౌన్ చేయాలని సూచించింది. ముంబైని పూర్తిగా మూసేసే దిశగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ప్రజలు రోడ్లపై ఉమ్మివేయడం ఆపేస్తే కరోనా కేసులు సగానికి తగ్గుతాయంది. వుహాన్ నగరాన్ని జనవరి 23 నుంచి లాక్డౌన్ చేశాకే అక్కడి పరిస్థితి మెరుగైందని పేర్కొంది. (క్వారంటైన్లో ఉండలేం) 52కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. రాష్ట్రంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 52కి చేరింది. గురువారం ఈ సంఖ్య 49 ఉండగా శుక్రవారం మరో ముగ్గురు రోగులు పెరిగారు. ఇందులో పుణే, పింప్రి–చించ్వడ్లో ఇద్దరు, మరొకరు ముంబైలో పెరిగారు. అయితే ఐదుగురికి కరోనా వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో ఆçస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. -
‘సామ్నా’ఎడిటర్‌గా సీఎం సతీమణి
సాక్షి, ముంబై : శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకురాలిగా ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కొనసాగనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ, ఉద్ధవ్ సంపాదకుడిగా కొనసాగారు. సామ్నాకు మొదటి సంపాదకుడిగా బాల్ ఠాక్రే వ్యవహరించగా, ఆయన మరణాంతరం ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు. జనవరి 23,1988న సామ్నా పత్రికను దివంగత బాల్‌ఠాక్రే ప్రారంభించారు. 2012లో ఆయన మరణించేవరకు ఆయన సంపాదకుడిగా కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది ఆయనకు సీఎం పదవి వరించిన నేపథ్యంలో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
రశ్మికు అమృత ఫడ్నవిస్ అభినందనలు..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ స్పందించారు. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు స్పీకరించినందుకు రశ్మికి అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు ముఖ్య స్థానాల్లో ఉంటేనే వారి అభిప్రాయాలను స్పష్టంగా బయటపెట్టగలరని పేర్కొన్నారు. ఈ మేరకు అమృత తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. (సామ్నా ఎడిటర్‌గా రశ్మి ఠాక్రే) కాగా ఆదివారం వెలువడిన సామ్నా పేపర్లో రశ్మిని ఎడిటర్‌గా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. మరోవైపు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. -
బీజేపీపై మిత్రపక్షం తీవ్ర ఆగ్రహం
సాక్షి, ముంబై: అధికార బీజేపీపై దాని మిత్రపక్షం శివసేన మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వాటి నివారణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలని డిమాండ్ చేసింది. రైతుల ఆత్మహత్యలు, మరాఠా రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని శివసేన కోరింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్‌ను ప్రచురించింది. కాగా గడిచిన ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రథయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. యాత్రపై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతాంగ సమస్యలను పరిష్కరించిన తరువాతే యాత్రను చేపట్టాలిన పేర్కొంది. రైతులకు ఏం చేశారని ప్రభుత్వ విజయంగా భావిస్తారని శివసేన ప్రశ్నించింది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించింది. అయోధ్యలో రామమందిర ఏర్పాటును కోరుతూ.. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రకు 25 ఏళ్లు పూర్తి అయినట్లు సామ్నా గుర్తుచేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆలయ నిర్మాణంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయిందని అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన రథయాత్రపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్లు శివసేన పేర్కొంది. -
‘అయోధ్య’ మధ్యవర్తిత్వంతో ఉపయోగం ఏంటీ?
సాక్షి, ముంబై: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివసేన అభిప్రాయపడింది. రామమందిరం అనేది దేశ ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, దానిని కేవలం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేరని పేర్కొంది. మందిర నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీచేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రికలో శనివారం కథనాన్ని ప్రచురించింది. హిందూవుల ఆంకాంక్ష అయిన రామమందిరాన్ని 25 ఏళ్లుగా ఎందుకు నాన్చుతూవున్నారని సేన ప్రశ్నించింది. ‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు! -
‘పాక్ అంతంతోనే.. ప్రపంచ శాంతి’
ముంబై : పుల్వామా ఉగ్రదాడి - సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ - పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌పై మరిన్ని దాడులు చేయాలంటూ శివసేన డిమాండ్ చేసింది. ఈ విషయం గురించి తన అధికార పత్రిక సామ్నాలో ‘పాక్ వల్ల కేవలం మనకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదమే. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది లేదు. అధికారం సైన్యం చేతిలో ఉంది. వారు దాని తప్పుగా వాడుతున్నారు. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ పూర్తిగా తొలగిస్తేనే శాంతి సాధ్యమవుతుంద’ని పేర్కొంది. అంతేకాక ‘సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లే కశ్మీర్ భూభాగాలను పాక్ ఆక్రమించుకుని.. వాటిని ఉగ్ర స్థావరాలుగా మార్చింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పాక్ మీద మరిన్ని దాడులు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. -
‘ఆక్సిజన్’ కోసమే మాతో తెగదెంపులు: సేన
ముంబై: కొందరికి అధికారమే ఆక్సిజన్ లాంటిదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎదురుదాడి చేసింది. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ‘మోదీ ఆక్సిజన్ అంటున్న అధికారం కోసమే 2014లో బీజేపీ మాతో పొత్తును తెంచుకుంది’ అని రాసింది. ‘మంచి రోజులు తెస్తామని హామీలిచ్చి విఫలమైన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు’ అని శివసేన బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడింది. మంచిరోజులు (అచ్ఛే దిన్) తెస్తామనే నినాదంతో 2014 ఎన్నికలప్పుడు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే. బీజేపీకి ఆక్సిజన్ లాంటి అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు నేరగాళ్లకు ఆ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందనీ, అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా దొంగలను పవిత్రులను చేస్తోందని శివసేన విమర్శించింది. -
‘ఆ ఒక్క కారణంతో ఆమెను విమర్శించడం తగదు’
సాక్షి, ముంబై : ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై మిత్రపక్షం శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. 1975లో విధించిన ఎమర్జెన్సీని సాకుగా చూపించి.. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవను మర్చిపోవడం తగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీని బీజేపీ నేతలు మరోసారి చర్చనీయాంశంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శిస్తూ తమ పార్టీ పత్రిక ‘ సామ్నా’ లో ఆదివారం వీకెండ్ కాలమ్ ఘాటుగా రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ఇందిరాకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం ఎంటో తెలుస్తుందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువచేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఇందిరపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు. ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది సామాన్యులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. చిన్న చిన్న వ్యాపారులు నష్టపోయారని తెలిపారు. బ్లాక్ మనీ బయటకు వస్తుందని ప్రధాని చెప్పారు..కానీ నల్ల కుబేరుల మనీ వైట్ మనీగా మరిందని ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాకు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు... కానీ నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలులు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 50 సీట్లను కూడా గెలువని అస్థిపంజరం లాంటి కాంగ్రెస్‌కు బీజేపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మానసిక స్థితికి బాగాలేదని అందకు ఆయన మాటలే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడాలి అంతే కానీ 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని శివసేన పేర్కొంది. -
‘దేశాన్నిపాలించడం అంటే పిల్లల ఆట కాదు’
ముంబై : బీజేపీపై శివసేన మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో అరాచకత్వాన్ని, హింసను వ్యాప్తి చేసి అధికారం నుంచి తప్పుకుందని విమర్శించింది. కశ్మీర్లో శాంతిని నెలక్పొడంలో బీజేపీ విఫలమైందని దుయ్యబట్టింది. తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో బీజేపీని బ్రిటీష్ పరిపాలకులతో పోల్చింది. బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా నుంచి తరలిపోయినట్లుగానే బీజేపీ కశ్మీర్లో హింసను పెంచి అధికారం నుంచి తప్పుకుందని ఆరోపించింది. దేశాన్ని పాలించడం అంటే చిన్న పిల్లల ఆట కాదని ఎద్దేవా చేసింది. దురాశ కలిగిన బీజేపీని చరిత్ర మరిచిపోయిందని ధ్వజమెత్తింది. కశ్మీర్లో ఎన్నడూలేని విధంగా వేల మంది జవాన్లు, సామాన్యులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కశ్మీర్లో రక్తపుటేరులు పారుతున్నాయని, దీనికి కారణం బీజేపీయే అని ఆరోపించింది. కానీ అందంతా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తిపై వేసి ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందని పేర్కొంది. -
అ చట్టం వస్తే.. ప్రజల సొమ్మూ లూటీనే!
సాక్షి, ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన మరోసారి తీవ్రస్థాయిలో విరుచకుపడింది. కేంద్రం తాజాగా అమలు చేయాలనుకుంటున్న ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ (ఎఫ్ఆర్డీఐ)పై శివసేన తన అధికార పత్రిక అయిన సామ్నాలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రజలనుంచి డబ్బును లూటీ చేయడం కోసమే కేంద్రం ఎఫ్ఆర్డీఐ చట్టాన్ని తీసుకువస్తోందని శివసేన దాడి చేసింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఆర్డీఐ బిల్లు... ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ప్రజల సొమ్మును బ్యాంకలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని శివసేన విమర్శించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే దివాళా తీసిన బ్యాంకులు.. డిపాజిటర్ల డబ్బులను స్వేచ్ఛగా ఉపయోగించుకుంటాయని చెప్పారు. ఇప్పటికే లోక్‌సభ ముందున్న ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. -
ఆ పత్రికను నిషేధించండి
శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాపై మూడు రోజుల నిషేధం విధించాలని మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. దాంతో మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితిని సృష్టిస్తున్నారంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు ప్రచారం చేసేలా ఆ పత్రికలో ముద్రించినందున పత్రికను ఫిబ్రవరి 16, 20, 21 తేదీలలో నిషేధించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్వేతా షాలిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని 10 కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌లకు ఫిబ్రవరి 16, 21 తేదీలలో రెండు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్నాపై నిషేధం విధించాలని కోరారు. అయితే.. సామ్నాను మూసేయడం ఎప్పటికీ సాధ్యం కాదని ఉద్ధవ్ ఠాక్రే పుణెలో ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీని బీజేపీ తప్పుబట్టిందని, మరి ఇది మాత్రం ఎమర్జెన్సీ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాలకు ప్రచారం కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎందుకు వెళ్తున్నారన్నారు. అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం ప్రధామంత్రి, ముఖ్యమంత్రి ప్రచారం చేయకూడదని చెప్పారు. -
కూటమి నుంచి బయటకి పోము: శివసేన
ముంబై: బీజేపీతో కయ్యాల కాపురం చేస్తున్న శివసేన ఎన్ డీఏ కూటమి నుంచి విడిపోయే ఆలోచనలేదని స్పష్టం చేసింది. తమపై పుకార్లను, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వరకు తమ గొంతునొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని సామ్నాలో ఆరోపించింది. సామ్నా ప్రతులను బీజేపీ కార్యకర్తలు కాల్చడంపై ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ ఆదర్శాలను బూడిద చేశారని విమర్శించింది. రాజకీయాలు చీకటి మయంగా మారాయని, ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, నిజం మాట్లాడినందుకే తమపై దాడి చేస్తున్నారని ఘాటుగా విమర్శించింది. తమపై ఇలానే ఆరోపణలు కొనసాగితే మోదీ చెబుతున్న స్మాట్ సిటీ ప్రాజెక్టులో ఒక్కొక్క నగరంలో ఐదు నుంచి పది పిచ్చాసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందని సామ్నాలో పేర్కొంది. గత కొంత కాలంగా కూటమి నుంచి సేన బయటకు వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
'సుధీంద్ర 100మంది కసబ్లతో సమానం!'
ముంబై: ప్రముఖ కాలమిస్టు, బీజేపీ నేత ఎల్కే అద్వానీ మాజీ రాజకీయ సలహాదారు సుధీంద్ర కులకర్ణిపై శివసేన తన దాడిని మానుకోవడం లేదు. ఇప్పటికే ఆయనపై నల్లరంగు చల్లి అమానుషంగా వ్యవహరించిన ఆ పార్టీ తాజాగా సుధీంద్ర కులకర్ణిని ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్‌తో పోల్చింది. 'కులకర్ణిలాంటి వాళ్లు ఇక్కడే ఉన్నప్పుడు పాకిస్థాన్‌కు కసబ్ లాంటి వాళ్లను పంపాల్సిన అవసరమే ఉండదు. 100 మంది కసబ్‌లకు సమానమైన నష్టాన్ని కులకర్ణి చేయగలరు' అంటూ శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో విరుచుకుపడింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణకు నిర్వాహకుడిగా ఉన్న సుధీంద్ర కులకర్ణిపై సోమవారం నల్లరంగు పోసి శివసేన నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు నిరాకరించడంతో శివసేన ఈ చర్యకు ఒడిగట్టింది. అయినప్పటికీ సుధీంద్ర వెనుకడుగు వేయకుండా కసూరి రాసిన 'నైదర్ ఏ హాక్ నర్ ఏ డోవ్: ఆన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్థాన్ ఫారెన్ పాలసీ' పుస్తకాన్ని సోమవారం సాయంత్రం ముంబైలో ఆవిష్కరించారు. -
పాక్‌కు బుద్ధి చెప్పాలంటే కాల్పులకు దిగాల్సిందే..
ముంబై: పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటే భారత్ కూడా కాల్పులతో రంగంలోకి దిగాలని శివసేన తెగేసి చెపుతోంది. తాజాగా పాకిస్థాన్ కాల్పులపై మండిపడిన శివసేన... తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తప్పేమీ లేదనీ పేర్కొంది. పాకిస్థాన్ 2013లో 347, 2014 లో 562 సార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ లెక్కలు చెప్పుకొచ్చింది. పొరుగుదేశం చేస్తున్న ఈ దుశ్చర్యల మూలంగా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 3 2,000 ప్రజలు తమ నివాసాలను వీడి పోవాల్సి వస్తోందని మండిపడింది. పాక్ కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు కాల్పుల విరమణ నిబంధనలను పక్కన పెట్టయినా సరే తగిన బుద్ధి చెప్పాలని తన సంపాదకీయంలో పేర్కొంది. పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్న దశలో ఉందని అయితే కేవలం అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే మనగలుగుతోందని పేర్కొంది. కాగా జమ్ము కశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో ఎల్వోసీలో సోమవారం పాక్ దళాలు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. -
కౌగలించుకుని.. కత్తితో పొడుస్తారు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన విషయంలో శివసేన మిశ్రమ స్పందన వ్యక్తం చేసింది. చైనా వాళ్లు ఎదురుగా కౌగలించుకుని, వెనక వీపుమీద కత్తితో పొడుస్తారని మండిపడింది. గతంలో చైనా విషయంలో మనకున్న అనుభవాలు ఇలాగే ఉన్నాయని, వాళ్లు ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వాళ్ల దేశంలో ఘనస్వాగతం పలుకుతూనే మరోవైపు భారతదేశ పటం నుంచి కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను తొలగించేశారని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో విమర్శించారు. మోదీ చైనా పర్యటన గురించి చెప్పే సమయంలో చైనా అధికారిక టీవీ సంస్థ అయిన సీసీటీవీ భారత దేశ చిత్రపటంలో కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లేకుండా చూపించింది. దీన్నిబట్టే చైనా వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనం గుర్తించాలని శివసేన వ్యాఖ్యానించింది. చైనా కేవలం అరుణాచల్ ప్రదేశ్‌ను లాక్కోవావలని చూడటమే కాక, కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతోందని చెప్పింది. -
కొత్త కోడలిలా వ్యవహరించాలి..
సర్కార్‌కు ‘సామ్నా’ సూచన సాక్షి, ముంబై: కొత్త కోడలు అత్తవారింట అణకువతో అందరినీ సంతోషపరిచేందుకు మనస్ఫూర్తిగా పనిచేసేటట్లుగానే బీజేపీ సర్కార్ కూడా రాష్ట్ర ప్రజల ఆశలను తీర్చాలని ‘సామ్నా’లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. సామ్నా శనివారం సంపాదకీయంలో ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజునే బీజేపీ ప్రభుత్వానికి సున్నితంగా మందలింపుతోపాటు సలహాలు, సూచనలు అందిస్తూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాన్ని నవ వధువుతో, రాష్ట్ర ప్రజలను అత్తతో పోల్చారు. పెళ్లైన కొత్తలో అత్తతోపాటు కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు కొత్త కోడలు పనులన్నింటినీ మనస్ఫూర్తిగా చేస్తుందని, తర్వాత అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కఠినమైనవారు కాకపోయినా మంచి అత్తలాంటివారని బీజేపీకి చురకలంటించారు. అదేవిధంగా అత్తను (మహారాష్ట్ర ప్రజలను) సంతోషపెట్టడం కోడలి కర్తవ్యమని బీజేపీకి సూచించారు. అలాచేయకుండా అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తే మాత్రం తాము చెవులు పిండుతామని పేర్కొన్నారు. హామీలను పూర్తిచేయాలి... మహారాష్ట్రను ముక్కలుచేయకుండా అఖండంగానే ఉంచాలని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని కోరారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కొత్త ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతోపాటు ఎన్నో ఆశలు ఉంటాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వారిదేనని ఆయన స్పష్టం చేశారు. డీఎఫ్ సర్కారు గత 15 ఏళ్లల్లో ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోయిందని, ఇలాంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం ‘ఫినిక్స్ పక్షి’ మాదిరిగా పైకి ఎగరాలని, ఇది కొత్త ముఖ్యమంత్రితో జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. -
శివసేన స్వరం మారిందా?
నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద కారాలు.. మిరియాలు నూరిన శివసేన ఉన్నట్టుండి గొంతు మార్చినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధికార పత్రిక 'సామ్నా'లో సోమవారం ఉదయం రాసిన సంపాదకీయంలో.. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్న ఆకాంక్షలు స్పష్టంగా కనిపించాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధాన కారకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలేనని అందులో రాశారు. 'మహారాష్ట్ర ప్రయోజనాలు' నెరవేరాలంటే బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకున్నా దానికి శివసేన సరేననేలాగే ఉంది. ఇంతకుముందు సామ్నాలో రాసిన సంపాదకీయాలలో మాత్రం బీజేపీ మీద కారాలు, మిరియాలు నూరారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా స్వరం మార్చడం.. ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో రాసిన సంపాదకీయాల్లో అయితే.. ప్రధాని తీవ్రంగా ప్రచారం చేసినా కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తాజా వ్యాసంలో మాత్రం ''రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. -
అవినీతిపరుల కోసమే సర్కారుకు మద్దతా?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన ఉలిక్కిపడింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తును తెంచుకున్న శివసేన.. తీరా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అనుకోకుండా ఎన్సీపీ నాయకులు బీజేపీవైపు మొగ్గు చూపడంతో తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీపై శివసేన మండిపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేకమంది అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని, అందులో ఎన్సీపీ ముందుందని చెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 22 స్థానాలు అవసరం. 41 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీ.. ఫలితాలు రాగానే తాము బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని తెలిపింది. కానీ బీజేపీ ఇంతవరకు దానిపై స్పందించలేదు. శివసేనకు 63 స్థానాలు రావడం, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు శివసేన పెట్టే షరతులను అంగీకరించొద్దంటూ గట్టిగా పట్టుబట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ లాంటి నాయకులను ముఖ్యమంత్రి చేయడానికి శివసేన ఎంతవరకు అంగీకరిస్తుందన్నది కూడా అనుమానమే. అవసరమైతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకుని.. అటు శివసేన, ఇటు ఎన్సీపీ రెండు పార్టీల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వాదనలు సైతం వచ్చాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో.. దీపావళి తర్వాతే ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అప్పటికి అందరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై శివసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ మద్దతు లేకుంటే మోడీ తండ్రి దామోదర దాస్ కూడా గెలిచేవారు కాదని శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నారు. మోడీకి సొంతంగా గెలిచే శక్తి లేదని శివసేన వ్యాఖ్యలు చేసింది. మోడీ ప్రధాని పదవి చేపట్టాక..మహారాష్ట్ర పార్టీ(శివసేన)ను గుర్తించడం మానేశారని సామ్నాలో పేర్కొన్నారు. అధికార దాహాంతో ఉన్న బీజేపీ...శివసేన పార్టీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆపార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే దుయ్యబట్టింది. రాజకీయ విమర్శల్లోకి మోడీ తండ్రి పేరును లాగడం వివాదస్పదంగా మారింది. ముంబైలో ఉంటున్న గుజరాతీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని శివసేన ఆరోపించింది. పాకిస్థాన్ ను ఓడించాలని బీజేపీకి అధికారమిస్తే.. ఆపార్టీ మమల్ని పెకిలించాలని ప్రయత్నాలు చేస్తున్నారని శివసేన మండిపడింది. బీజేపీ మోసాని బట్టబయలు చేస్తామని శివసేన తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ చచ్చిన పాములు అని సామ్నా ఎడిటోరియల్ తెలిపారు. -
'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'
ముంబై: మహారాష్ట్రపై దృష్టి పెట్టడం మానేని పాకిస్థాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమేలాగో ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోడీకి శివసేన సూచించింది. నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలపై పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతున్నా అదుపు చేయడంలో మోడీ సర్కారు విఫలమైందని 'సామ్నా' పత్రికలో శివసేన పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని, పాకిస్థాన్ పై దృష్టి పెట్టాలని సలహాయిచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదని, దృఢమైన సంకల్పం ఉంచే చాలని శివసేన పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయాల గురించి తర్వాతైనా ఆలోచించొచ్చని, అంతకంటే ముందు పొరుగుదేశం దాడులపై స్పందించాలని కోరింది. -
వెనక్కు తగ్గిన శివసేన
ముంబై: మగాళ్లపై అత్యాచార ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందంటూ సామ్నా సంపాదయకీయంలో రాసిన వివాదాస్పద రాతలపై శివసేన వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ‘ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ వివాదం నేపథ్యంలో సామ్నా రాసిన సంపాదకీయాన్ని తప్పుగా అర్థం చేసుకొని శివసేన పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోంది. అత్యాచారమనేది తీవ్రమైన నేరమే. ఈ విషయంలో శివసేనకు మరో అభిప్రాయం లేదు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యాచార ఆరోపణలు చేయడం కూడా తీవ్రమైన నేరమే’నని తాజా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలు కేసు నమోదు చేయాలని సంపాదకీయంలో స్పష్టంగా చెప్పామని పేర్కొంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఐదారు నెలల్లో వైద్యపరమైన సాక్ష్యాలు విలువలేనివిగా మారిపోతాయని, కేసు అనేక మలుపులు తిరుగుతుందనే అభిప్రాయాన్ని మాత్రమే తాను వ్యక్తం చేశామని శివసేన పేర్కొంది. మరాఠీలో రాసిన సంపాదకీయాన్ని అనువాదం చేసే సమయంలో అనేక వక్రీకరణలో చోటుచేసుకున్నాయని, అంతా శివసేనవైపే వేలెత్తి చూపుతున్నారే తప్ప మరోవైపు చూడడంలేదని పేర్కొంది. టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు జర్నలిజంపై అత్యాచారం చేశాయని విమర్శించింది. ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంపై దృషి సారించాలని శివసేన డిమాండ్ చేసింది. సామ్నా సంపాదకీయం విషయంలో ఎటువంటి వివాదానికి తావులేదని, సునీల్ పరస్కార్ కేసు కోర్టు పరిధిలో ఉందని సూచించింది. ఇదిలాఉండగా ‘ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపడానికి ఉన్నతవర్గాలకు చెందినవారిపై అత్యాచారం, అత్యాచారయత్నం కేసులు పెట్టడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది. డీఐజీ సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలు పోలీసుశాఖలో పనిచేశారు. ఓ మోడల్ ఆయనపై ఆరోపణలు చేయగానే రాత్రికి రాత్రే ఆయన విలన్ అయిపోయారు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి చట్టాలు ఆయుధాలుగా మారుతున్నాయ’టూ సామ్నా సంపాదకీయంలో రాయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేపుతోంది. -
సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!
శివసేన అధికారిక పత్రిక సామ్నా తరహాలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దినపత్రికను ప్రారంభించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ఎలక్షన్ సెల్ కార్యవర్గ సభ్యులకు, పార్టీ అధికారిక ప్రతినిధులకు, నిర్వాహక కార్యదర్శులకు ఇచ్చిన విందు సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు. ఈ పత్రిక సాయంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, అలాగే వివిధ అంశాలపై ప్రభుత్వం, పార్టీ ఏమనుకుంటున్నాయో స్పష్టంగా రాయచ్చని చౌహాన్ అన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్లు ఈ పత్రికలో రాస్తారని, ఇది రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది కార్యకర్తలకు వెళ్తుందని చెప్పారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.