
'కేజ్రీవాల్ కంటే రాఖీసావంత్ నయం'
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పార్టీ పత్రిక సామ్నాలో బాల ఠాక్రేలాగే ఘాటుగా సంపాదకీయాలు రాస్తున్న ఉద్ధవ్ ఠాక్రే.. ఈసారి నేరుగా కేజ్రీవాల్పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అంటూ విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు. ఇటీవల ఆయన ఉద్యమం చేయడాన్ని, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఏకవచనంలో సంబోధిస్తూ తిట్టడాన్ని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ను మరాఠీ యాసలో.. పిచ్చోడు అని అభివర్ణించారు. కేజ్రీవాల్ చేసిన తమాషా చూసి పార్టీలన్నీ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని, ఆప్ సంస్కృతి ఇలాగే ఉంటుందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇలా ఉన్నాయి..
దేశంలో పిచ్చోళ్ల సంత ఒకటి మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ అనే పిచ్చోడు దానికి నాయకుడు.
సుశీల్ కుమార్ షిండేని కేజ్రీవాల్ ఏకవచనంతో పిలిచి, తిట్టారు. ఇదేం సంస్కృతి? ఇది దొంగలు, వైట్కాలర్ నేరగాళ్లు వాడే భాష
చేతన్ భగత్ లాంటి మద్దతుదారులు కూడా సిగ్గుపడి, ఆప్ను ఐటెం గర్ల్తో పోల్చారు. షిండే అతడిని పిచ్చోడంటే, ఎన్సీపీకి చెందిన త్రిపాఠీ పాముతో పోల్చారు.
కుమార్ విశ్వాస్ అనే మరో జోకర్ ఆ సర్కస్లో ఉన్నాడు. అతడు మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి.
కేజ్రీవాల్ పిచ్చిసంత ఎన్నాళ్లో ఉండబోదు. ఐటెం గర్ల్ ఎంతసేపు ఉండాలో అంతసేపే డాన్స్ చేయాలి.