తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దేశ రాజధాని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. తన పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సానుకూలంగా ఉన్నా టీఆర్‌ఎస్ సర్కారు తనను విస్మరించడం శోచనీయమని హస్తినలో ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో తమిళసై భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు తమిళసై తాజా వ్యాఖ్యలతో బలం చేకూర్చాయి. తెలంగాణ ఏం జరుగుతుందో ప్రధాని సహా అందరికీ తెలుసునని ఆమె అన్నారు. తెలంగాణలో జరుగుతున్నదంతా ఓపెన్ సీక్రెట్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులతో విభేదించినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్లను దూరం పెడతారా అంటూ వాపోయారు. అయితే గవర్నర్లతో ముఖ్యమంత్రులకు బేదాభిప్రాయాలు కొత్తకాదు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. వర్తమానంలోనూ పలు రాష్ట్రాల్లో సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య విభేదాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది. (క్లిక్: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు)
జగదీప్‌తో దీదీ ఢీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత జనవరిలో గవర్నర్ జగదీప్ దంకర్‌ను ట్విటర్‌లో బ్లాక్ చేశారు. ప్రతిరోజు ట్వీట్లు పెడుతూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని, తమను బానిసల్లా చూస్తున్నారని.. అందుకే ట్విటర్‌లో ఆయనను బ్లాక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా తమ విధుల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు అనేక సమస్యలపై మమతా బెనర్జీ, గవర్నర్ దంకర్ మధ్య తలెత్తిన విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. తాను పంపిన ఫైల్స్‌పై గవర్నర్ సంతకాలు పెట్టడం లేదని గత ఫిబ్రవరిలో మమత ఆరోపించారు. కావాలనే ఇదంతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దంకర్ కంటే ముందు గవర్నర్‌గా పనిచేసిన కేశరీనాథ్‌తోనూ మమతా బెనర్జీకి బేదాభిప్రాయాలు వచ్చాయి. (చదవండి: బీజేపీ జెండాతో వచ్చానా?)
సింగ్ వర్సెస్ థాకరే
మహారాష్ట్రలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుతో గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. సీఎం ఉద్ధవ్ థాకరే ఇటీవల నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీలపై నిర్ణయాన్ని గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. (క్లిక్: రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి)
అక్కడ కూడా అంతే!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కూడా అభిప్రాయ బేధాలున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం, ఇతర అంశాల్లో సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లెఫ్టినంట్ గవర్నర్లతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదు. ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తోనూ ఇదే పరంపర కొనసాగుతుంది.
పరిష్కారం ఏమిటి?
గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ వారిని గవర్నర్‌లుగా నియమించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న భావన ఉంది. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని తటస్థులను నియమించాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment