కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment