సాక్షి, ముంబై : శివసేన అధినేత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని రాజకీయాల్లో ‘ఐటమ్ గర్ల్’గా అభివర్ణించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌తో పోలుస్తూ ఎద్దేవా చేశారు. ‘సామ్నా’ దినపత్రిక శుక్రవారం సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో ఆప్, కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా ‘యేడ్యాంచి జాత్రా’ (వెర్రి వెంగళప్పల నాటకం) అనే శీర్షికతో ప్రచురించి సంపాదకీయంలో ఆప్ సర్కారు పనితీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై రోడ్డున పడి ఆందోళన చేసిన తీరును కూడా ఉద్ధవ్ గర్హించారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు దొరకని స్థితిలో ఒక పాటలో ఇలా వచ్చి మురిపించి అలా మాయమయ్యే ఐటమ్ గర్ల్ మాదిరిగా దేశంలో ఆప్ వ్యవహార శైలి ఉందన్నారు. ‘ఢిల్లీ సర్కారు పనితీరు చూస్తుంటే ఆయన(కేజ్రీవాల్) స్థానంలో హిందీ నటి రాఖీసావంత్ ఉండి ఉంటే ఇంకా సమర్ధవంతంగా వ్యవహరించి ఉండే’దని తన సంపాదకీయంలో పేర్కొన్నారు.