అద్వానీ కూరలో కరివేపాకు కాదు!
అద్వానీకి బిజెపి టికెట్ విషయంలో మిత్రపక్షం శివసేన నోరువిప్పింది. అద్వానీని అప్పుడే తీసిపారేయకండి అంటూ సలహా కూడా ఇచ్చింది. అద్వానీ శకం ఇంకా ముగియలేదు అని కూడా చెప్పింది.
శివసేన పత్రిక సామ్నాలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాకరే బిజెపిని పటిష్టపరచడంలో, ఇప్పుడున్న స్థాయికి తేవడంలో అద్వానీ పాత్ర ఎంతైనా ఉందని, అసలు అద్వానీ ఎక్కడ నుంచి పోటీచేయాలన్న విషయాన్ని ముందే తేల్చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. అంతే కాదు... అసలు తొలి జాబితాలో ఉండాల్సిన అద్వానీ పేరు ఇంతాలస్యంగా ఎందుకు వచ్చిందని విమర్శించింది.
మురళీమనోహర్ జోషీ ని కాన్పూర్ కి పంపించడం, రాజనాథ్ సింగ్ లక్నోకి మారడం, సిద్ధుకి బదులు అమృత్సర్ నుంచి అరుణ్ జైట్లీ బరిలోకి దిగడం వంటివి బిజెపిలో అంతర్గతంగా ఉన్న సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది సామ్నా.
'అంతా బాగానే ఉంది. శివసేన నుంచి మాజీ సీఎం, మాజీ లోకసభ స్పీకర్ మనోహర్ జోషీ కి ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ అధికార ప్రతినిధి నార్వేకర్ సమాజ్వాదీ పార్టీలో ఎందుకు చేరారు, చెప్పవే గురివిందా!. ' అని బిజెపి నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.