శివసేన స్వరం మారిందా?
నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద కారాలు.. మిరియాలు నూరిన శివసేన ఉన్నట్టుండి గొంతు మార్చినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధికార పత్రిక 'సామ్నా'లో సోమవారం ఉదయం రాసిన సంపాదకీయంలో.. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్న ఆకాంక్షలు స్పష్టంగా కనిపించాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధాన కారకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలేనని అందులో రాశారు. 'మహారాష్ట్ర ప్రయోజనాలు' నెరవేరాలంటే బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకున్నా దానికి శివసేన సరేననేలాగే ఉంది.
ఇంతకుముందు సామ్నాలో రాసిన సంపాదకీయాలలో మాత్రం బీజేపీ మీద కారాలు, మిరియాలు నూరారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా స్వరం మార్చడం.. ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో రాసిన సంపాదకీయాల్లో అయితే.. ప్రధాని తీవ్రంగా ప్రచారం చేసినా కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తాజా వ్యాసంలో మాత్రం ''రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.