కౌగలించుకుని.. కత్తితో పొడుస్తారు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన విషయంలో శివసేన మిశ్రమ స్పందన వ్యక్తం చేసింది. చైనా వాళ్లు ఎదురుగా కౌగలించుకుని, వెనక వీపుమీద కత్తితో పొడుస్తారని మండిపడింది. గతంలో చైనా విషయంలో మనకున్న అనుభవాలు ఇలాగే ఉన్నాయని, వాళ్లు ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వాళ్ల దేశంలో ఘనస్వాగతం పలుకుతూనే మరోవైపు భారతదేశ పటం నుంచి కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లను తొలగించేశారని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో విమర్శించారు.
మోదీ చైనా పర్యటన గురించి చెప్పే సమయంలో చైనా అధికారిక టీవీ సంస్థ అయిన సీసీటీవీ భారత దేశ చిత్రపటంలో కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లేకుండా చూపించింది. దీన్నిబట్టే చైనా వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనం గుర్తించాలని శివసేన వ్యాఖ్యానించింది. చైనా కేవలం అరుణాచల్ ప్రదేశ్ను లాక్కోవావలని చూడటమే కాక, కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు మద్దతు పలుకుతోందని చెప్పింది.