పాక్కు బుద్ధి చెప్పాలంటే కాల్పులకు దిగాల్సిందే..
ముంబై: పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పాలంటే భారత్ కూడా కాల్పులతో రంగంలోకి దిగాలని శివసేన తెగేసి చెపుతోంది. తాజాగా పాకిస్థాన్ కాల్పులపై మండిపడిన శివసేన... తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తప్పేమీ లేదనీ పేర్కొంది.
పాకిస్థాన్ 2013లో 347, 2014 లో 562 సార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ లెక్కలు చెప్పుకొచ్చింది. పొరుగుదేశం చేస్తున్న ఈ దుశ్చర్యల మూలంగా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 3 2,000 ప్రజలు తమ నివాసాలను వీడి పోవాల్సి వస్తోందని మండిపడింది. పాక్ కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు కాల్పుల విరమణ నిబంధనలను పక్కన పెట్టయినా సరే తగిన బుద్ధి చెప్పాలని తన సంపాదకీయంలో పేర్కొంది.
పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్న దశలో ఉందని అయితే కేవలం అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే మనగలుగుతోందని పేర్కొంది. కాగా జమ్ము కశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో ఎల్వోసీలో సోమవారం పాక్ దళాలు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.