Shiv Sena Sensational Comments On Nehru And Gandhi Family, Fires On Modi - Sakshi
Sakshi News home page

వారి ముందు చూపు వ‌ల్లే ఈ రోజు దేశం మ‌నుగ‌డ: శివసేన

Published Sat, May 8 2021 5:32 PM | Last Updated on Sat, May 8 2021 8:02 PM

Shiv Sena Said India Surviving Because Of Nehru And Gandhi Family - Sakshi

ముంబై: మ‌హారాష్ట్ర అధికార పార్టీ శివ‌సేన సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వ‌ల్ల‌నే ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభంలో భార‌త్ మనుగ‌డ సాగించ గ‌లుగుతున్న‌ద‌ని శివ‌సేన పేర్కొంది.  కాగా, కోవిడ్ క‌ట్ట‌డిలో మోదీ ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌లమైందని మండిపడింది. క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్ర‌భుత్వం మాత్రం వేలాది కోట్ల‌తో నిర్మిస్తున్న సెంట్ర‌ల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేద‌ని త‌న అధికార ప‌త్రిక‌ సామ్నా ఎడిటోరియ‌ల్‌లో ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

దేశంలో క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో పేద దేశాలు భార‌త్‌కు స‌హాయం చేస్తుండ‌గా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టును నిలుపుద‌ల చేసేందుకు ప్ర‌ధాని మోదీ సిద్ధంగా లేర‌ని శివ‌సేన మండిప‌డింది. ఒక వైపు బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య స‌హాయం పొందుతూ మ‌రోవైపు పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న నిర్మాణం, ప్ర‌ధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించ‌డంపై ఎవ‌రూ విచారం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న‌ద‌ని శివ‌సేన ఎద్దేవా చేసింది.

"కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళ‌న వ్యక్తం చేసింది. క‌రోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్‌డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. 

"స్ప‌ష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్య‌వ‌స్థ‌ల వ‌ల్ల‌నే భార‌త్ మ‌న‌గులుగుతున్న‌ది. చాలా పేద దేశాలు భార‌త్‌కు స‌హాయం అందిస్తున్నాయి. గ‌తంలో పాకిస్తాన్‌, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల‌ నుంచి స‌హాయం పొందేవి. దేశంలో ప్ర‌స్తుత పాల‌కుల వ‌ల్ల భార‌త్ అలాంటి స్థితికి దిగ‌జారుతున్న‌ది" అని శివ‌సేన‌ విమ‌ర్శించింది.

"కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించాల‌ని బీజేపీ ఎంపీ సుబ్రహ్మ‌ణ్య స్వామి డిమాండ్ చేశార‌ని, ప్ర‌స్తుత‌ కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌న్న‌దానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని శివ‌సేన విమ‌ర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హ‌యాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వ‌ల్ల‌నే ప్ర‌స్తుతం దేశం మ‌నుగ‌డ సాధిస్తున్న‌ది. వారు ఇచ్చిన‌ విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement