2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు.
కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.
నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే.
అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు.
నిజమైన లక్ష్యం
ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.
ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.
చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌తో, వెలమలు బీఆర్‌ఎస్‌తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్‌లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు.
ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.
కుల గణనతోనే రిజర్వేషన్లు
ఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.
అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికి
కేంద్రం సుముఖంగా లేదు.
ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్‌రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది.
అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.
కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?
భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి.
వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.
కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.
- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
Comments
Please login to add a commentAdd a comment