యస్..కలుస్తాం! | Vote for Sena...er MNS: When Raj Thackeray Flubbed Party Symbol | Sakshi
Sakshi News home page

యస్..కలుస్తాం!

Published Wed, Oct 8 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

యస్..కలుస్తాం!

యస్..కలుస్తాం!

- ఉద్ధవ్‌తో కలిసి పనిచేసే విషయమై రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్య
- అన్నదమ్ములం కలిసి పనిచేస్తే మీకేంటి బాధని ఎదురుప్రశ్న
- రాజకీయాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ
- తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉద్ధవ్ ఫోన్‌చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకోలు

సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే అన్నదమ్ములిద్దరం కలిసి పనిచేస్తామని రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన నేత ఉద్ధవ్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. అసలు తామిద్దరం కలిసి పనిచేస్తే వేరే వారికి ఎందుకు బాధ, ఇబ్బందులో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు.
 
‘మా ఇద్దరి సిద్ధాంతాలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటికంటే ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్ధవ్,నేను అవసరమైతే ఒక్కటవుతాం.. దీనిలో మీకెందుకంత ఉత్సాహం.. మా పని మేం చూసుకుంటాం..’ అని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. పొత్తులు బెడిసికొట్టిన నేపథ్యంలో అన్ని పార్టీలకూ ఒంటరి పోరు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త సమీకరణాలకు తలుపులు తెరుచుకునేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ, శివసేన కూటమి విడిపోయిన తర్వాత రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు ఒక్కటి కానున్నారంటూ హల్‌చల్ చేసిన పుకార్లు నిజం కానున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అవసరమైతే ఈ రెండు పార్టీలూ కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
 
ఉద్ధవ్ ఫోన్ చేసిన మాట వాస్తవమే...
తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన విషయం వాస్తవమేనని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయానన్నారు. ‘కేవలం ఎలా ఉన్నావు..? ఆరోగ్యం ఎలా ఉందని ఉద్ధవ్ అడిగాడు. కాని నాకు విపరీతంగా దగ్గువస్తుండడం ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాన’నని వివరించారు.
 
భూతద్దంలో చూడొద్దు...

ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం సరికాదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ నేత నితిన్ గడ్కరి, తాను అనుకోకుండా ఒకే హోటల్‌ల్లో దిగామని.. అలా ఆయనతో తాను మాట్లాడానని తెలిపారు. కాని దీనిపై గడ్కరీతో భేటీ కావడం వెనుక రహస్యమేమిటి.,.? రహస్యంగా గడ్కరితో భేటీ అయిన రాజ్ ఠాక్రే.. అని శీర్షికలతో కథనాలు వెలువడటం సరి కాదన్నారు. గడ్కరీతో నాకు వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలున్నాయా.. లేవే.. అలాంటి సమయంలో రహస్యంగా కలవాల్సిన అవసరం నాకేంటి..’ అని రాజ్ ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement