సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. తమ పార్టీ సీట్లను ఆశిస్తున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు ముంబైలోని ఎన్సీపీ భవన్‌లో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
అయితే ఇందులో మొత్తం 288 శాసనసభ నియోజక వర్గాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీట్ల పంపకంపై ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య ఇంతవరకు రాజీ కుదర లేదు. చివరకు ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ మొత్తం 288 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూలు ఆహ్వానించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఈసారి రెండు పార్టీలు ఒంటరిగా బరిలో దిగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల కిందట ముంైబైలోని తిలక్ భవన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఔత్సాహిక అభ్యర్థుల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. వేళ్లపై లెక్కించే విధంగా అభ్యర్థులు రావడంతో ప్రతిపక్షాలకు విమర్శించేందుకు మంచి అవకాశం దొరికింది.
ఆ సందర్భంలో కాంగ్రెస్ కూడా 288 నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీన్నిబట్టి కాంగ్రెస్ కూడా ఒంటిరిగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నటు అనిపించింది. ఇప్పుడు ఎన్సీపీ నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాల్సిందే. మూడు రోజులపాటు జరిగే ఈ ఇంటర్వ్యూల్లో రాష్ట్రంలోని మొత్తం 288 నియోజక వర్గాల అభ్యర్థులను ఆహ్వానించామని పార్టీ ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. ఆ రోజు తమతమ నియోజకవర్గాల నివేదిక కచ్చితంగా వెంట తీసుకురావాలని దరఖాస్తుదారులను ఆదేశించారు. దీన్నిబట్టి ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీకి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా స్పష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కేటాయించాల్సిన స్థానాల విషయమై కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మిత్రపక్షాల మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతుండడం తెలిసిందే. దీంతో సీట్ల పంచాయితీని ఢిల్లీలోనే పరిష్కరించుకోవాలని ఇరు కాంగ్రెస్, ఎన్సీపీ (మహారాష్ట్ర) నాయకులు తుది నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు, ఎన్సీపీ నాలుగు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి కాంగ్రెస్ కంటే తమ పార్టీకే ప్రాబల్యం ఎక్కువ ఉందని ఎన్సీపీ వాదిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల కోసం తమకు 144 స్థానాలు ఇవ్వాల్సిందేనన్నది ఎన్సీపీ డిమాండ్.
కాంగ్రెస్ మాత్రం 2009లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన వాటికంటే కంటే 10 స్థానాలు అధికంగా.. అంటే 124 స్థానాలు ఇస్తామని స్పష్టీకరించింది. దీంతో సీట్ల పంచాయితీ కోసం ఇరు పార్టీల నాయకులు ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షమైన ఎన్సీపీకీ 114 సీట్లు కేటాయించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో 124 సీట్లు ఇచ్చింది.
దీంతో 2004 ఫార్ములానే ఈ ఎన్నికల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేవలం పది స్థానాలు ఎక్కువ ఇవ్వడం తమకు సమ్మతం కాదని ఎన్సీపీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడవచ్చని ఎన్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరికి వారు రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ ఇంటర్వ్యూలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే పొత్తు కొనసాగే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పొత్తు పొడిచేనా ?
Published Wed, Aug 20 2014 10:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement