సాక్షి ముంబైః శాసనసభ ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. సమర్థులైన అభ్యర్థుల కోసం అధ్యయనం ప్రారంభించాయి. పార్టీలు బలోపేతంగా ఉన్నప్పటికీ సమర్థులైన అభ్యర్థులు దొరకడం కష్టసాధ్యమేనని పార్టీల సీనియర్లు అంటున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం వేటను తీవ్రతరం చేశాయి. గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ నాయకులు కొందరు ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి రావాలంటే సమర్థులైన అభ్యర్థులు అవసరమని ఇరు కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. పార్టీలు బలంగానే ఉన్నప్పటికీ గెలిపించే సత్తా కలిగిన అభ్యర్థులు కాంగ్రెస్, ఎన్సీపీలో కరువయ్యారని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2009లో కాంగ్రెస్ 174 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఈ సారి కనీసం 130 సీట్లు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరో 10 స్థానాలు అధికంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పటికీ, 16 సీట్లయినా ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు పోటీ చేసేందుకు ఆసక్తికనబరిచిన అభ్యర్థుల్లో గెలుపు గుర్రాల సంఖ్య తక్కువేనని అంచనా. గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన అభ్యర్థులు మాత్రం ఈసారి పోటీకి పెద్దగా ఆసక్తిచూపలేదు.
పవార్-తట్కరేదే ఆధిపత్యం...
ఎన్సీపీ పరిస్థితి గమనిస్తే పార్టీ అధ్యక్షుడి సోదరుని కుమారుడైన ప్రస్తుత ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే ఆధిపత్యం కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నాయకులు ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, గణేష్ నాయక్, భాస్కర్ జాధవ్, బబన్‌రావ్ పాచ్‌పుతే వంటి వారికి ప్రాధాన్యం లభించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు శివసేన, బీజేపీలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు వినికిడి. బీజేపీ త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. హైదరాబాద్‌లో గట్టి ప్రాబల్యం ఉన్న ఎంఐఎం కూడా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్‌లో..
కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. ఓడిపోయేపార్టీలో తాను బాగస్వామిని కాలేననని ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి నారాయణ రాణేను ఇటీవలే బుజ్జగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తుండడంతో వర్గ రాజకీయాలు కాంగ్రెస్‌లో అధికమయ్యాయని చెబుతున్నారు. నారాయణరాణే, అశోక్ చవాన్, పతంగ్‌రావ్ కదంతోపాటు మరి కొందరు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారని సమాచారం.
ఈ భారీ పోటీ వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.