ముంబై: సామ్నా.. శివసేన పార్టీ పత్రిక కాదని, అందులో గుజరాతీలకు వ్యతిరేకంగా ప్రచురితమైన సంపాదయకీయంతో పార్టీకి సంబంధం లేదని శివసేన విద్యార్థి విభాగం, యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, వారంతా మహారాష్ట్ర వ్యతిరేకులంటూ సామ్నా సంపాదకీయంలో ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనిపై గత రెండ్రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువసేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, పార్టీ నాయకులందరిలో కూడా ఇదే అభిప్రాయముందని శివసేన పార్టీ అధ్యక్షడు ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా చెప్పారన్నారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు ఠాక్రేకు వారు, వారికి ఠాక్రే సహాయసహకారాలు అందించుకునేవారన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన ఎంతో చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలందరినీ పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందన్నారు.
అసోం అల్లర్లకు మోడీ బాధ్యుడు కాదు..
కాంగ్రెస్ వైఖరిపై మరోసారి శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. సామ్న సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో కాంగ్రెస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కపిల్ సిబల్, ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అసోంలో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కారణంగానే మారణకాండ (అల్లర్లు) జరిగాయని ఆరోపించే కాంగ్రెస్ నాయకులు ముందు వారేమిటో తెలుసుకోవాలని చురకలంటించారు. ‘మీ మారణకాండలో.. రక్తంతో తడిచిన మీ చేతులకు.. కేవలం హిందువులే రక్తమే అంటుకొని ఉంటుంద’ంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోడీ కారణంగా దేశం ముక్కలవుతోందని
ఆరోపించే కాంగ్రెస్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని లేదా యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆశ్రమానికి వెళ్లాలంటూ హితవు పలికారు.
ఫలితాల తర్వాత పిచ్చాసుపత్రికే..
అసోం అల్లర్లకు మోడీ కారణం కాదని, ఆయనే కారణమంటూ మాట్లాడుతున్నవారి మానసికస్థితి దెబ్బతిన్నదన్నారు. మే 16 ఎన్నికల ఫలితాల తర్వాత వారందరిని పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. అసోంలో బోడోలకు, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీ ముస్లింలకు మధ్య గొడవ జరుగుతోందని, ఇది ఇప్పటిది కాదన్నారు. అసోంలోని ఏడు జిల్లాలు బంగ్లాదేశీయుల స్వాధీనంలో ఉన్నాయని, దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లోని బంగ్లాదేశీయులను బయటికి పంపిస్తారన్నారు. కాశ్మీరులో హిందూ పండితులకు గౌరవపూర్వకంగా నివసించే హక్కులు కల్పిస్తారనే భయంతో కపిల్ సిబల్, ఒమర్ అబ్దుల్లాలు ఇలా గొంతు చించుకుంటున్నారని విమర్శించారు.
సామ్నా మాట.. సేన మాట కాదు!
Published Mon, May 5 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement