Sena Uddhav
-
ముండేకు పలువురి నివాళి
సాక్షి, ముంబై: ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయానికి ముంబైలో మంగళవారం పలువురు నివాళులు అర్పించారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ ఠాక్రే, కుమారుడు ఆదిత్య, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్ ఠాక్రే, శివసేన నాయకుడు సుభాష్ దేశాయి, ఆర్.ఆర్.పాటిల్, సచిన్ అహిర్, రాందాస్ ఆఠవలే, ఛగన్ భుజబల్, హేమమాలిని, దగ్గరి బంధువులు పూనం మహాజన్, రాహుల్ మహాజన్, వర్షా గైక్వాడ్, ప్రకాశ్ జావ్డేకర్, రితేశ్ దేశ్‌ముఖ్, కర్ణాటక బీజేపీ నాయకుడు యడ్యూరప్ప, రాజ్ పురోహిత్, మనోహర్ జోషి, వినోద్ తావ్డే, కిరీట్ సోమయ్య, మాణిక్‌రావ్ ఠాక్రే తదితర రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు,కొందరు తెలుగు ప్రజలు ముంబైలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. తెలుగువారితో ఉన్న అనుబంధం.. గత అనేక సంవత్సరాలుగా ముండేకు తెలుగు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. అత్యవసర సమయంలో ఆయన దగ్గరికి వెళితే చేతనైన సాయం చేసేవారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ నుంచి రైలులో ముంబై వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో సాయం చేయాలని తెలుగు సంఘాలు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాయి. వెంటనే స్పందించిన ముండే ముంబై పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. హంతకులను వెంటనే పట్టుకోవాలని కోరారు. ఇదే కేసులో మాదిరెడ్డి కొండారెడ్డి కూడా ఆయనను ప్రత్యేకంగా కలుసుకుని వినతి పత్రం అందజేశారు. పూర్తిగా కొనసాగని నాయకులు.. మరఠ్వాడా రీజియన్ నుంచి అనేక మంది దిగ్గజాలు రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు. ఈ ప్రాంతానికి చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రమోద్ మహాజన్, గోపినాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందారు. ప్రమోద్ మహాజన్ చెల్లెలినే ముండే పెళ్లి చేసుకున్నారు. పూర్ణ బంగ్లాలో ఇప్పుడూ అదే వాతావరణం.. దాదాపు పదేళ్ల కిందట బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ చనిపోయినప్పుడు పూర్ణ బంగ్లా పరిసరాలు ప్రముఖులతో, రాజకీయ నాయకులు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పుడే ముండే చనిపోవడంతో మంగళవారం సాయంత్రం మళ్లీ అదే వాతావరణ కనిపించింది. మహాజన్, ముండే కుటుంబాలు పూర్ణ బంగ్లాలోనే ఉంటున్నాయి. మొన్నటి వరకు మహాజన్ కుటుంబం బాగోగులు ముండే చూసుకునేవారు. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్ద దిక్కులు మరణించారు. -
సామ్నా మాట.. సేన మాట కాదు!
ముంబై: సామ్నా.. శివసేన పార్టీ పత్రిక కాదని, అందులో గుజరాతీలకు వ్యతిరేకంగా ప్రచురితమైన సంపాదయకీయంతో పార్టీకి సంబంధం లేదని శివసేన విద్యార్థి విభాగం, యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, వారంతా మహారాష్ట్ర వ్యతిరేకులంటూ సామ్నా సంపాదకీయంలో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై గత రెండ్రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువసేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, పార్టీ నాయకులందరిలో కూడా ఇదే అభిప్రాయముందని శివసేన పార్టీ అధ్యక్షడు ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా చెప్పారన్నారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు ఠాక్రేకు వారు, వారికి ఠాక్రే సహాయసహకారాలు అందించుకునేవారన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన ఎంతో చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలందరినీ పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందన్నారు. అసోం అల్లర్లకు మోడీ బాధ్యుడు కాదు.. కాంగ్రెస్ వైఖరిపై మరోసారి శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. సామ్న సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో కాంగ్రెస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కపిల్ సిబల్, ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అసోంలో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కారణంగానే మారణకాండ (అల్లర్లు) జరిగాయని ఆరోపించే కాంగ్రెస్ నాయకులు ముందు వారేమిటో తెలుసుకోవాలని చురకలంటించారు. ‘మీ మారణకాండలో.. రక్తంతో తడిచిన మీ చేతులకు.. కేవలం హిందువులే రక్తమే అంటుకొని ఉంటుంద’ంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోడీ కారణంగా దేశం ముక్కలవుతోందని ఆరోపించే కాంగ్రెస్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని లేదా యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆశ్రమానికి వెళ్లాలంటూ హితవు పలికారు. ఫలితాల తర్వాత పిచ్చాసుపత్రికే.. అసోం అల్లర్లకు మోడీ కారణం కాదని, ఆయనే కారణమంటూ మాట్లాడుతున్నవారి మానసికస్థితి దెబ్బతిన్నదన్నారు. మే 16 ఎన్నికల ఫలితాల తర్వాత వారందరిని పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. అసోంలో బోడోలకు, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీ ముస్లింలకు మధ్య గొడవ జరుగుతోందని, ఇది ఇప్పటిది కాదన్నారు. అసోంలోని ఏడు జిల్లాలు బంగ్లాదేశీయుల స్వాధీనంలో ఉన్నాయని, దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లోని బంగ్లాదేశీయులను బయటికి పంపిస్తారన్నారు. కాశ్మీరులో హిందూ పండితులకు గౌరవపూర్వకంగా నివసించే హక్కులు కల్పిస్తారనే భయంతో కపిల్ సిబల్, ఒమర్ అబ్దుల్లాలు ఇలా గొంతు చించుకుంటున్నారని విమర్శించారు. -
మూడో విడత ప్రచారంపై దృష్టి
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు తెరపడడంతో ఇక మూడో దశ ఎన్నికల ప్రచారంపై ఆయా పార్టీలు దృష్టి సారించాయి. నగరంలో ముఖ్య నేతలతో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ, 21న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభ ఉందని ఆయా పార్టీల నేతలు తెలిపారు. కాగా, మొన్నటివరకు నగరంతో పాటు శివారు ప్రాంతంలో అడపాదడపా జరిగిన ప్రచారాలు ఇక నుంచి మరింత జోరుగా సాగనున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనవల్ల బిజీగా ఉన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు మూడో దశ ఎన్నికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గిరణ్ గావ్ (మిల్లులున్న) ప్రాంతంలో దక్షిణ ముంబై మహా కూటమి అభ్యర్థి అరవింద్ సావంత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు నగరంలో బడా నాయకులు ప్రచారాలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. 2009లో నగరం, శివారు ప్రాంతాల్లోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతోంది. అదే శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమికి మూడు స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చవాన్, మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ వారం రోజుల్లో ఎన్నికల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకే ఏకదాటిని ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.