సాక్షి, ముంబై: ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయానికి ముంబైలో మంగళవారం పలువురు నివాళులు అర్పించారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ ఠాక్రే, కుమారుడు ఆదిత్య, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్ ఠాక్రే, శివసేన నాయకుడు సుభాష్ దేశాయి, ఆర్.ఆర్.పాటిల్, సచిన్ అహిర్, రాందాస్ ఆఠవలే, ఛగన్ భుజబల్, హేమమాలిని, దగ్గరి బంధువులు పూనం మహాజన్, రాహుల్ మహాజన్, వర్షా గైక్వాడ్, ప్రకాశ్ జావ్‌డేకర్, రితేశ్ దేశ్‌ముఖ్, కర్ణాటక బీజేపీ నాయకుడు యడ్యూరప్ప, రాజ్ పురోహిత్, మనోహర్ జోషి, వినోద్ తావ్డే, కిరీట్ సోమయ్య, మాణిక్‌రావ్ ఠాక్రే తదితర రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు,కొందరు తెలుగు ప్రజలు ముంబైలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు.
తెలుగువారితో ఉన్న అనుబంధం..
గత అనేక సంవత్సరాలుగా ముండేకు తెలుగు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. అత్యవసర సమయంలో ఆయన దగ్గరికి వెళితే చేతనైన సాయం చేసేవారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ నుంచి రైలులో ముంబై వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో సాయం చేయాలని తెలుగు సంఘాలు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాయి. వెంటనే స్పందించిన ముండే ముంబై పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. హంతకులను వెంటనే పట్టుకోవాలని కోరారు. ఇదే కేసులో మాదిరెడ్డి కొండారెడ్డి కూడా ఆయనను ప్రత్యేకంగా కలుసుకుని వినతి పత్రం అందజేశారు.
పూర్తిగా కొనసాగని నాయకులు..
మరఠ్వాడా రీజియన్ నుంచి అనేక మంది దిగ్గజాలు రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు. ఈ ప్రాంతానికి చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రమోద్ మహాజన్, గోపినాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందారు. ప్రమోద్ మహాజన్ చెల్లెలినే ముండే పెళ్లి చేసుకున్నారు.
పూర్ణ బంగ్లాలో ఇప్పుడూ అదే వాతావరణం..
దాదాపు పదేళ్ల కిందట బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ చనిపోయినప్పుడు పూర్ణ బంగ్లా పరిసరాలు ప్రముఖులతో, రాజకీయ నాయకులు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పుడే ముండే చనిపోవడంతో మంగళవారం సాయంత్రం మళ్లీ అదే వాతావరణ కనిపించింది.
మహాజన్, ముండే కుటుంబాలు పూర్ణ బంగ్లాలోనే ఉంటున్నాయి. మొన్నటి వరకు మహాజన్ కుటుంబం బాగోగులు ముండే చూసుకునేవారు. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్ద దిక్కులు మరణించారు.
ముండేకు పలువురి నివాళి
Published Tue, Jun 3 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement