సీఎం పదవి మాదే!
ముంబై: వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా తమ తరఫునే సీఎం ఉంటారని శివసేన పార్టీ పేర్కొంది. సీట్ల పంప కం విషయంలో శివసేన ఒకరికి ఇచ్చేదే తప్ప తీసుకునే స్థితిలో లేదంటూ బీజేపీకి స్పష్టం చేసింది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... పొత్తు, సీట్ల పంపిణీపై శివసేన, బీజేపీ ఇరు పార్టీలూ పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గురువారం జరిగిన ఒక సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్రలో శివసేన అతిపెద్ద పార్టీగా ఉంది.. అదే కొనసాగుతుంది కూడా. బీజేపీ పుట్టకముందు నుంచీ మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఉంది. సీట్ల విషయంలో శివసేన ఇచ్చేదేగాని, తీసుకునేది కాదు. పొత్తులు ఉన్నా లేకున్నా.. ముఖ్యమంత్రి మాత్రం శివసేన తరఫునే ఉంటారు..’’ అని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని, పొత్తు వీడడమనేది ఇంతవరకూ లేదని పేర్కొన్నారు. కాగా, సంక్షోభం పరిష్కారం కోసం ఇరు పార్టీల నేతలు శుక్రవారం సాయంత్రం చర్చలు జరిపారు. సీట్ల పంపిణీ వ్యవహారం కొలిక్కి వస్తుందని సంకేతాలిచ్చారు. కూటమిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చర్చల్లో పాల్గొన్న ఉద్ధవ్ కుమారుడు అదిత్య ఠాక్రే చెప్పారు. సీట్ల పంపిణీపై శివసేనకు ఒక ప్రతిపాదన ఇచ్చామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే వారేనని బీజేపీ పేర్కొంది.