సాక్షి, ముంబై: లోక్‌సభ మాజీ స్పీకర్, శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి భవితవ్యంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సీనియర్ నాయకుడు ఆదివారం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లినట్టు చెబుతున్నప్పటికీ, జోషీ ఒక అడుగు వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎలా స్పందించారనేది మాత్రం తెలియరాలేదు. దాదర్ లోక్‌సభ సీటు విషయమై గత రెండు మూడు నెలలుగా జోషీ, శివసేనలో విభేదాలు ఏర్పడ్డాయి. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే స్మారకం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. పార్టీలో నాయకత్వ లేమి కనిపిస్తోందంటూ పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు.
మునుపటి మాదిరిగా శివసేనలో దూకుడు స్వభావమున్న నేతృత్వంలేదన్నారు. ఇది జరిగిన అనంతరం, అక్టోబర్ 13 నాటి దసరా ర్యాలీలో మనోహర్ జోషికి చేదు అనుభవం ఎదురయింది. సేన కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వేదికపై నుంచి లేచివెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి కోపమూ లేదని, ఆయన నుంచి ఇంతవరకు పిలుపురాలేదని, వస్తే తప్పకుండా మాతోశ్రీ బంగ్లాకు వెళతానని మనోహర్ జోషీ చెబుతూ వస్తున్నారు. ఊహించని విధంగా జోషీ కొంత చల్లబడ్డట్టు కనిపిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఆదివారం మాతోశ్రీకి వెళ్లిన ఆయన ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆర్పీఐ అధ్యక్షులు రామ్‌దాస్ అథవలే కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలిసింది.
రాజకీయ చర్చలే వీ జరగలేదు..
భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శుభాకంక్షలు తెలిపేందుకే తాను మాతోశ్రీకి వెళ్లినట్టు మనోహర్ జోషీ మీడియాకు తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏదీ లేదన్నారు. దీపావళి సందర్భంగా శివసేన కార్యకర్తలు, నాయకులు కూడా మాతోశ్రీకి రావడంతో ఉద్ధవ్ ఠాక్రే జోషికి పెద్దగా సమయం కేటాయించలేకపోయరని తెలి సింది. అయినప్పటికీ వీరి భేటీ అనంతరం అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. సేనలో మనోహర్ జోషీకి మళ్లీ మంచిరోజులు వచ్చినట్టేనా..? లేదా అనే విషయమై అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ఇక ఆర్పీఐ అధిపతి రామ్‌దాస్ అథవలేకు ఉద్ధవ్ ఠాక్రే దీపావళిని పురస్కరించుకుని కానుక (హామీ) ఇచ్చినట్టు తెలిసింది. ఈసారి తనకు రాజ్యసభ సీటు లభిస్తుందని అథవలే విశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు మహాకూటమి కూడా అంగీకరించిందని తెలిపారు.