సాక్షి, ముంబై: శివసేన పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మనోహర్ జోషి దారేటూ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ సభ్యులు అంటుండగా, అసంతృప్తి సద్దుమణిగి ఉద్ధవ్‌తో కలిసే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు. దసరా ర్యాలీ తర్వాత ఇప్పటివరకు ఉద్ధవ్, జోషి ఎదురెదురు పడి మాట్లాడుకున్న దాఖలాలు లేకున్నా త్వరలోనే పార్టీలో నెలకొన్న ఈ తుఫాన్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. దీనికి వచ్చే నెల 14న వాంఖెడే స్టేడియంలో సచిన్ కెరీర్‌లో ఆడనున్న చివరి, 200వ టెస్టు మ్యాచ్ వేదిక కానుందని వార్తలు వినవస్తున్నాయి.
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే వీరు వీఐపీ గ్యాలరీలోనే తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలపైనే చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజక వర్గ అభ్యర్థిగా జోషిని ప్రకటించకపోవచ్చనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనిపై ఉద్ధవ్‌ను కలిసి మాట్లాడగా ఆ స్థానంలో ఇప్పటివరకు ఏ అభ్యర్థిని
బరిలోకి దింపాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉంటున్న జోషికి ఇటీవల శివాజీపార్క్‌లో జరిగిన దసరా ర్యాలీలో కార్యకర్తల నుంచి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆయన సభ నుంచి అర్థంతరంగా లేచి వెళ్లిపోవల్సి వచ్చింది. ఆ తర్వాత ఇరువురి మధ్య రాజీ కుదరడం గాని, భేటీ అయ్యే అవకాశాలు సన్నగిల్లినట్లేనని అందరూ భావించారు.
అయితే సచిన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెపుతున్నట్లు ప్రకటించడం, ఆ చివరి మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరగనుండటంతో వీరిద్దరు ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అవకాశాలున్నాయని ఊహగానాలు ఊపందుకున్నాయి. అక్కడ వీరి మధ్య రాజీ కుదరవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సచిన్ ఆఖరు క్రికెట్ మ్యాచ్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది.అయితే ఈ మ్యాచ్ తిలకించడానికి ఉద్ధవ్, జోషి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలో ఇరువురు భేటీ అవుతుండవచ్చని భావిస్తున్నారు.
ఇదిలాఉండగా దసరా ర్యాలీలో అవమానం భరించలేక వేదికపై నుంచి దిగి వెళ్లిపోయిన తర్వాత జోషి తన ఆవేదనను లిఖిత పూర్వకంగా ఉద్ధవ్‌కు వెల్లడించారు. అయినా ఉద్ధవ్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో జోషి ఏం నిర్ణయం తీసుకుంటారు..? ఉద్ధవ్‌తో చర్చిస్తారా..? అనే అంశాలపై రాజకీయ నాయకులు తమకు ఇష్టమున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ చివరి క్రికెట్ మ్యాచ్ పుణ్యమా అని భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన జోషికి, ఎంసీఏ సభ్యుడైన ఉద్ధవ్‌కు కూడా ఆహ్వానం అందనుంది. దీంతో వీరు వీఐపీ బాక్స్‌లో ఎదురుపడనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు విచ్చేయనున్నారు.
పవార్ సమక్షంలో ఉద్ధవ్, జోషీలు భేటీ అవుతుండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.అయితే జోషితో ఎలాంటి సంప్రదింపులు, ఇక నుంచి ఆయనకు ఏ పదవులు ఇవ్వకూడదని ఉద్ధవ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జోషితో కనీసం చర్చలే కాదు. కనీసం ఆయన రాసిన లేఖకు సమాధానం ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఉద్ధవ్ వైఖరి ఇలాగే కొనసాగితే క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు స్టేడియానికి రాకపోవచ్చని తెలుస్తోంది.