సాక్షి, ముంబై: శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీ మారనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ అనుమానం మరింత బలపడుతోంది. పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేతో చెప్పాపెట్టకుండా గురువారం ఆయన రాజధానికి పయనం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన జోషి ఆ తర్వాత కొందరు బీజేపీ సీనియర్ నేతలతో కూడా సమావేశమైనట్లు చెప్పుకుంటున్నారు. దాదర్ లేదా కల్యాణ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని జోషి భావించినా అందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు పార్టీలోని కొందరు నేతలే చెప్పుకుంటున్నారు. కనీసం రాజ్యసభ సీటునైనా దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఆయన ఢిల్లీకి పయనమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా జోషి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డా స్వయంగా ఆయనే వాటిని ఖండించడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయితే గురువారం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనం కావడం చూస్తుంటే గతంలో వెలువడిన కథనాలే నిజమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవార్‌తో భేటీ ఎందుకు?
ప్రస్తుతం నగరంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలతో వాతావరణం వేడిగా ఉంది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే కూడా పోటీ చేస్తున్నారు. దీంతో పవార్, ముండేల మధ్య పోటాపోటీగా సమరం సాగనుంది. కాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మనోహర్ జోషి మాజీ అధ్యక్షుడు కావడంతో స్వయంగా పవారే, జోషిని పిలిపించినట్లు చెప్పుకుంటున్నారు. ఎంసీఏ గద్దెనెక్కేందుకు పవార్, జోషి మద్దతు తీసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిద్దరి భేటి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి రావడంతోనే రోజంతా ఓ హోటల్ గదికే పరిమితమైన జోషి సాయంత్రం బయటకు వచ్చి పవార్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు.
అయితే ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఢిల్లీకి రాలేదని, అకస్మాత్తుగా రావాల్సి వచ్చిందని జోషి సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే ఎందుకు వచ్చారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.
పవార్‌తో జోషి మంతనాలు
Published Sat, Oct 12 2013 12:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement