సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి అనేక కీలక పదవులు చేపట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై నుంచి టికెటు నిరాకరించడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే నన్ను అడగకుండానే అనేక పదవులు కట్టబెట్టారు. ఆయన కొడుకు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రం టికెట్‌ను కూడా నిరాకరించారు’ అని ఓ టీవీ చానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ శివసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల గణేశ్ ఉత్సవాల సమయంలో దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో బీఎంసీ స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు కావడంపై జోషి అసంతృప్తికి గురయ్యారు.
దీంతో ఆయన మాతోశ్రీ బంగ్లాకు చేరుకుని ఉద్ధవ్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఉద్ధవ్ శేవాలేకు సర్దిచెబుతారని ఆయన భావించినా, అలా ఏమీ జరగలేదు. ఆ తరువాత ఉద్ధవ్ వీళ్లిద్దరినీ ఎదురుఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి వాగ్వాదాలు వద్దంటూ సర్దిచెప్పారు. దీంతో శేవాలేకు మాతోశ్రీ అండ ఉందనే విషయం జోషికి తెలిసిపోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తన కు పూర్వవైభవం వస్తుందని జోషి విశ్వసిస్తున్నారు. ములాయంసింగ్, జయలలిత, మమతా బెనర్జీ వంటి నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని జోషి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అదృష్టం వరిస్తే తను రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అంతదూరం వెళ్లాలంటే ముందు ఇక్కడ టికెటు రావడం తప్పనిసరని జోషి వివరించారు.
జోషికి భవిష్యత్‌పై బెంగ
Published Thu, Oct 3 2013 12:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement