Uddav Thakare
-
శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు. ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్‌కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్‌దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్‌లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్‌గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్‌ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
'నేను భారతీయుడిని'
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ, ఆ పార్టీ అధినేతలు ఒవైసీ సోదరులపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ''నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు'' అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాకరే ముందుగా బీజేపీతో వ్యవహారం చక్కదిద్దుకొని, ఆ తరువాత తమ గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మజ్లిస్ పార్టీని నిషేధించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రణీతి షిండేకు నోటీసులు పంపినట్లు చెప్పారు. ** -
అత్యాచారం ఓకే కానీ.. రోటీ కాదా?
ప్రతిపక్షాలపై ‘సామ్నా’లో శివసేన ఎదురుదాడి సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రోటీ అంశంపై శివసైనికుల చర్య సరికాదని చెప్పేవారికి.. బెంగళూరు స్కూల్లో ఓ ముస్లిం వ్యక్తి పవిత్ర రంజాన్ మాసంలో ఓ చిన్నారిపై అత్యాచారం జరపడం సరైనదిగా కనిపిస్తోందా అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ప్రశ్నించారు. క్యాంటీన్లో ఆహారం సరిగా లేకపోవడంపై నిరసన తెలిపే సందర్భంలో జరిగిన ఘటనకు కొన్ని పార్టీలు మతం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర సదన్‌లో ఓ ముస్లిం ఉద్యోగికి శివసేన ఎంపీ రాజన్ విచారే బలవంతంగా రోటీ తినిపించి రోజా (ఉపవాసానికి)కు భంగం కలిగేలా వ్యవహరించినట్లు కనిపించిన వీడియోను తప్పుపట్టిన ప్రతిపక్షాలు.. ముస్లిం వర్గాలపై శివసేన జులుం చలాయిస్తోందని దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో గురువారం ‘సామ్నా’ పత్రిక సంపాదకీయంలో ఉద్ధవ్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించారు. ‘మహారాష్ట్ర సదన్ కాంట్రాక్టర్ ఏ మతానికి చెందినవారన్నది ఆయన ముఖంపై రాసి ఉండదు కదా.. అయినా శివసైనికులు ఒక ముస్లిం వ్యక్తిని రోజా విరమించేలా చేశారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టి మా పార్టీకి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోం.. ముఖ్యంగా మీరు గొడవకు దిగుతున్న ది శివసేనతో అన్నది గుర్తుపెట్టుకోండి’అంటూ ఉద్ధవ్ హెచ్చరించారు. -
‘ఉద్ధ’రించిందేమీ లేదు..!
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రేకు నాయకత్వ లక్షణాలు లేవు..అసలు శివసేనకు అతడు చేసిందేమీ లేదు.. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను అత్యధికంగా ఇబ్బంది పెట్టింది ఉద్ధవ్ ఠాక్రేనే.. ఈ నిజాన్ని ఆయన ఇంట్లో పనిచేసే నౌకర్లను అడిగినా చెబుతారని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే విమర్శించారు. కొంకణ్ పర్యటనలో భాగంగా నారాయణ్ రాణే సింధుదుర్గ్ జిల్లాకు బయలుదేరారు. అంతకు ముందు హాత్‌ఖంబా ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిష్టతో పనిచేసేవారికి, సమర్థవంతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తను ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ందులో ఎటువంటి మార్పూ లేదని, రాజీనామాకు గల కారణాలను అప్పుడే స్పష్టం చేస్తానని తెలిపారు. ‘ఉద్ధవ్ ఠాక్రే నన్ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన విమర్శలు, దూకుడుతనం మరింత ఎక్కువైంది.. ఇతరులపై ఆరోపణలు చేయడానికి బదులు బాల్ ఠాక్రే ఆదర్శాలను, సిద్ధాంతాలను కాపాడేందుకు కృషిచేస్తే మంచిది..’ అని రాణే వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మరోసారి ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, మొత్తం వారి కుటుంబంలో, పార్టీలో ఏం జరుగుతుందో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ‘కొంకణ్‌వాసులను భయాందోళన నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తానని ఉద్ధవ్ అంటున్నారు.. నేను నెలకు మూడుసార్లు కొంకణ్‌లో పర్యటిస్తుంటాను.. ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదుల దాడులు, భయానక వాతావరణం, నేరాల కేసులు నమోదు కావడం లాంటి సంఘటనలు నాకు ఎక్కడా కనిపించడం లేదు.. మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్న ఆ భయాందోళనలు ఏమిటో. .’నని చమత్కరించారు. ఎన్నికలు సమయంలో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు కొంకణ్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు రైళ్ల గురించి పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్ధవ్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం పెరిగిన రైలు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మీకు కనిపించడం లేదా.. లేకుంటే ఇవన్నీ చూసి మీకు భయమేస్తోందా.. అలా అయితే కొంకణ్ రావద్దు’ అని ఉద్ధవ్‌కు రాణే సలహా ఇచ్చారు . లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఎంపీలు గెలవడంలో వారి గొప్పతనమేమీ లేదన్నారు. కేవలం మోడీ ప్రాబల్యం వల్లే వారంతా గెలిచి గట్టేక్కారని వ్యాఖ్యానించారు.‘శివసేనకు నాయకుడు లేడు.. అది నేతృత్వం లేని పార్టీ. అందులో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహిస్తున్న పాత్ర ఏమీ లేద’ని రాణే దుయ్యబట్టారు. ‘ 39 సంవత్సరాలు శివసేనలో కొనసాగాను.. అందులో ఆఖరు 15 సంవత్సరాలు బాల్ ఠాక్రేకు దగ్గరగా ఉన్నాను.. వాస్తవానికి శివసేన నుంచి బయటపడిన వారందరి కంటే బాల్ ఠాక్రేను ఎక్కువగా వేధించింది ఉద్ధవ్ ఠాక్రేనే..’అని ఘాటుగా విమర్శించారు. ‘బాల్ ఠాక్రే అప్పట్లో కుటుంబ సభ్యుల్ని, ఇంటిని వదిలి రెండుసార్లు బయటపడ్డారు. ఆయన ఎందుకు వెళ్లారు..? ఎక్కడ ఉంటుండేవారు...? మాకు తెలుసు.. ఇంటి వాతావరణం గురించి నౌకర్లను అడిగితే వారే చెబుతారు’ అని రాణే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాణే ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలియదు : మాణిక్‌రావ్ నాగపూర్: మంత్రిపదవికి నారాయణ్ రాణే ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారో తనకు తెలియదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాణేకు ప్రభుత్వంలో సముచితం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న రాణే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే అధిష్టానంతో ఆయన చర్చించవచ్చని ఠాక్రే సూచించారు. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్‌ల హాయాంలో లోక్‌సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్‌ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్‌ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్‌ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్‌ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
సంపాదకీయంతో సమస్యలు
సాక్షి, ముంబై: గుజరాతీయులకు వ్యతిరేకంగా సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావుత్‌కు చిక్కులు తప్పేలా లేవు. సామ్నాలో ఆయనకు అధికారాలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని గుజరాత్ ప్రజలపై రావుతే రాసిన సంపాదకీయంపై ఉద్ధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయమై అధికారికంగా వివరాలు అందకపోయినా, ప్రస్తుత పరిస్థితులను బట్టి రావుత్ అధికారాలను తగ్గించడం ఖాయమని భావిస్తున్నారు. శివసేన అధికార పత్రిక సామ్నా వర్కింగ్ ఎడిటర్‌గా సంజయ్ రావుత్ విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. గుజరాతీ ప్రజలను విమర్శిస్తూ ఈ నెల ఒకటిన ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సంపాదకీయంతో ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన భార్యతో యూరప్ పర్యటనలో ఉన్నారని సేన వర్గాలు వివరణ ఇచ్చాయి. సంపాదకీయంలో ఏం రాసినా, అది శివసేన అధికార వైఖరేనని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలు, ఇతర విషయాలన్నీ సామ్నా ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తెలియజేసేవారు. అయితే గుజరాతీలపై రాసిన సంపాదకీయంపై తీవ్ర విమర్శలు రావడంతో ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. వివాదాస్పద సంపాదకీయంతో శివసేన పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. సామ్నా.. శివసేన అధికారిక పత్రిక కాదని, ఇటీవలి సంపాదకీయంలో పార్టీ ప్రమేయం లేదన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని సామ్నా విమర్శించడం తెలిసిందే. దీనిపై గత రెండు రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలూ లేవని, పార్టీ నాయకులందరిలోనూ ఇదే అభిప్రాయముందని ఉద్ధవ్ స్వయంగా చెప్పారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు పరస్పర సహాయసహకారాలు అందించుకునేవారని అన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన గుజరాత్లో సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలను పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందని ఠాక్రే అన్నారు. ప్రస్తుత పరిణామాలతో సేన కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఈ వివాదానికి కారణమైన సంజయ్ రావుత్‌కు సామ్నాపై ఉన్న అధికారాలను కొంత తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సామ్నా పత్రిక విధుల్లో కొన్నింటిని చేపట్టాలని శివసేన నాయకులు సుభాష్ దేశాయి, లీలాధర్ డాకేను కూడా ఆదేశించినట్టు సమాచారం. రావుత్‌కు అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పార్టీ రహస్యాలు ప్రత్యర్థులకు తెలిసిపోతున్నాయని కొందరు ఉద్ధవ్ ఠాక్రేకు చెప్పినట్టు తెలిసింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా గుజరాతీయులపై రాసిన సంపాదకీయంతో మరింత అసంతృప్తికి గురైన ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సుభాష్ దేశాయి, లీలాధర్ డాకే కు పత్రికలో కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిసింది. రెండు రోజుల క్రితమే వారు బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. -
చివరి పోరు.. అమీతుమీ
ముంబై: చివరి విడత లోక్‌సభ ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రజాస్వామ్య కూటమి, మహాకూటములు ఈ సందర్భంగా ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవడంలేదు. తమ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేస్తున్న ర్యాలీల్లో భారీగా జనాలు పాల్గొనేలా చూసుకుంటున్నారు. దీనికోసం కోట్లాది రూపాయల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టేందుకు సైతం ఆయా పార్టీలు వెనుకాడటంలేదు. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగనున్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ బహిరంగ సభ నిమిత్తం కేవలం గ్రౌండ్ కోసం ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సీసీ) ఎమ్మెమ్మార్డీయేకు రూ.30 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎంఆర్సీసీ చీఫ్ జనార్ధన్ చందూర్కర్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా భారీ ర్యాలీ కాబట్టి దాని కోసం భారీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.. అందువల్ల ఆ మాత్రం ఖర్చు తప్పదు..’ అని తెలిపారు. అలాగే ఈ ర్యాలీలో ప్రజాస్వామ్య కూటమి భాగస్వాములైన ఎన్సీపీ,ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే నాయకత్వంలోని ప్రజా రిపబ్లికన్ పార్టీల ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటున్నారని చందూర్కర్ తెలిపారు. ఈ భారీ ర్యాలీ కోసం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే 5 వేలమందిని తరలించాలని పార్టీ శాఖ ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, వారందరికీ పార్టీ టార్గెట్ నిర్ణయించిందని, సుమారు నాలుగు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా కాషాయ కూటమి కూడా ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడంలేదనే తెలుస్తోంది. ప్రజాస్వామ్య కూటమి ర్యాలీకి దీటుగా ఈ నెల 21వ తేదీన కాషాయ కూటమి సైతం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దీనికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు. కాగా ఈ ర్యాలీ కోసం రూ.34 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. కాగా, నగరంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో నగరంలోని 6 లోక్‌సభ స్థానాల్లో ఐదింటిని ఈ పార్టీ గెలుచుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎన్సీపీ ఎగరేసుకుపోయింది. 19 స్థానాల్లోనూ ఉద్దండుల ప్రచారం.. రాష్ట్రంలోని 19 లోక్‌సభ స్థానాల్లో చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు అంజలి దమానియా తమ పార్టీ ఉత్తర ముంబై అభ్యర్థి సతీష్ జైన్ కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే మూడు రోజులపాటు ఆమెతోపాటు పలువురు ఆప్ నాయకులు ముంబైలోని అన్ని నియోజకవర్గాలతోపాటు, కొంకణ్, ఉత్తర మహారాష్ర్ట ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. మొదటి దఫా ఎన్నికల్లో పార్టీ చీఫ్ సోనియాగాంధీ విదర్భలో ప్రచారం చేశారు. ఈ దఫా కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలైన నందూర్బర్, ధులేల్లో జరిగే ర్యాలీల్లో ప్రచారం చేయనున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా మొదటిసారి ముంబైలో జరుగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొననున్నారు. కాషాయ కూటమి భాగస్వామి అయిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం సాయంత్రం కల్యాణ్(ఠాణే)లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, చివరి విడతలో 338 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 43,343 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాటుచేశారు. -
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో వైఎస్ జగన్ భేటీ
ముంబై: రాష్ట్ర విభజన ప్రక్రియను స్తంభింపచేసేలా మద్దతు ఇచ్చేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే గతంలో అసెంబ్లీలో తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను, ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్-3ని సవరించడానికి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభలో 270 మంది మద్దతున్న ఏ పార్టీ అయినా వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారని తెలిపారు. అందుకనే ఆర్టికల్ -3ని సవరించాలని తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. మొదటిసారిగా దేశంలో ఎప్పుడూ సంభవించనిది ఇప్పుడు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారిగా ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్‌పార్టీ విభజనకు పాల్పడుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్ధవ్ సహా అందరి సహకారం కోరుతున్నామన్నారు. రేపు మహారాష్ట్ర, ఎల్లుండి కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడునూ విభజిస్తారని మండిపడ్డారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం తప్పనిసరి అవుతుందని జగన్ తెలిపారు. అధికారంలోకి రామని తెలిస్తే ఏ పార్టీ అయినా విభజనకు దిగడానికి పూనుకుంటుందని, ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ముడిపెట్టి ఇలాంటి ఆట ఆడటానికి ప్రతీ పార్టీ సిద్ధపడుతుందని తెలిపారు. -
‘సచిన్ అభిమానుల కల సాకారం’
ముంబై: అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు పలువురు రాష్ట్ర ప్రముఖులు శనివారం అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మంది సచిన్ అభిమానుల కల సాకారమైందని గవర్నర్ కె.శంకరనారాయణన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇదే పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సైతం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ దక్కిన ఈ అరుదైన గౌరవం మనదేశ యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. ఆయన గొప్పక్రీడాకారుడేగాక సహృదయుడని ప్రశంసిం చారు. భారతీయులను ఐక్యంగా ఉంచడంలోనూ సచిన్ సఫలమయ్యారని ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
జోషి తిరుగుబాటు
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై సీటుకు పార్టీ అధిష్టానం హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న మాజీ లోకసభ స్పీకర్, శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఉద్ధవ్ నాయకత్వ సామర్థ్యంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఉద్ధవ్ ప్రభుత్వంతో మిలాఖతై అన్ని పనులూ చేయించుకుంటున్నారని, పోరాటాలు, ఉద్యమాలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. ఉద్ధవ్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం లేదని, అంతా తానే చూసుకోవాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే తాను సేనలోనే కొనసాగుతానని, అధిష్టానం ఆదేశించిన చోటు నుంచే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు. బాల్‌ఠాక్రే మాదిరిగా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరూ ప్రస్తుత శివసేనలో లేరని దాదర్‌లో శుక్రవారం పేర్కొన్నారు. మరోవైపు ఆయన శివసేనను వీడనున్న వార్తలకు మరింత బలం చేకూరేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన పరోక్షంగా శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంపై సవాల్ విసిరారని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై మనోహర్ జోషి, శివసేన సీనియర్ నాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం కావాలని డిమాండ్ చేయడంతోపాటు పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే భేటీతో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్‌ఠాక్రే స్మారకం ఏర్పాటు కాకపోవడానికి శివసేన నాయకత్వలోపమే కారణమన్నారు. ‘బాల్‌ఠాక్రే ఆ స్థానంలో ఉండి ఉంటే ప్రభుత్వాన్ని కూడా కూల్చేవారు. స్మారకం మాత్రం ఏర్పాటయ్యేదన్నారు. ఆయన మాదిరిగా దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాచేస్తే ఇప్పటి వరకు స్మారకం అయిపోయేది’ అని జోషి పేర్కొన్నారు. ఉద్ధవ్, రాజ్ ఒక్కటవ్వాలి... శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రేలిద్దరూ ఒక్కటవ్వాలని మనోహర్ జోషి పిలుపునిచ్చారు. ‘రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒకే విషయంపై పోరాడుతున్నారు. వారిద్దరి లక్ష్యాలు ఒక్కటే. కేవలం పనిచేసే తీరు వేరు. అందుకే వీరిద్దరూ ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్‌ఠాక్రే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీరిద్దరు కూడా ఆదే చేస్తున్నారు. అయితే ఒక్కటిగా చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఉద్ధవ్‌తో భేటీ అయిన జోషి దాదర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోషి.. ఉద్ధవ్‌తో శనివారం ఆయన నివాసం మాతోశ్రీలోనే భేటీ అయ్యారు. ఈ వీరిద్దరి మధ్య చర్చల వివరాలు వెల్లడి కాలేదు. అయితే జోషి వ్యాఖ్యలపై సేన సీనియర్ నాయకులు రామ్‌దాస్ కదమ్, ఏక్నాథ్ షిండే తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, పదవులపై వ్యామోహంతోనే జోషి ఆ వ్యాఖ్యలు చేశారని కదమ్ విమర్శించారు. నేడు శివసేన దసరా ర్యాలీ సాక్షి, ముంబై: శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణానంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన దసరా ర్యాలీ కోసం ఈ పార్టీ సిద్ధమయింది. ర్యాలీ ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రతి ఏటా దసరా ర్యాలీలో దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రసంగం వినడానికి భారీగా జనం వచ్చేవారు. ఈసారి ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపించవచ్చని తెలుస్తోంది. అయితే ఆయన స్థానంలో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ఠాక్రే ఈసారి తన ప్రసంగంతో ఏ మేరకు ఆకట్టుకుంటారు ? ఏయే అంశాలపై మాట్లాడనున్నారనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆదివారం జరగనున్న దసరా ర్యాలీపై దృష్టి పెట్టారని చెప్పవచ్చు. గత 48 సంవత్సరాలుగా ఒకటి రెండు ఘటనలు మినహా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ర్యాలీ జరుగుతోంది. ఇది శివసేనకు ఆనవాయితీగా మారింది. బాల్‌ఠాక్రే సందేశాన్ని వినేందుకు ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివచ్చేవారు. ఈసారి కూడా శివాజీపార్క్ ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు వస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే. ఈసారి ర్యాలీ నిర్వహించేందుకు బీఎంసీ నుంచి అనుమతి లభించదని, సేన ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోకతప్పదని అంతా భావించారు. అయితే ఎట్టకేలకు హైకోర్టు ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేయడంతో సేన ఊపిరిపీల్చుకుంది. ఈ అనుమతి లభించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సహకరించారని తెలుస్తోంది. భారీ భద్రత...: ర్యాలీకి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అనేక మంది పోలీసులను మోహరించనున్నారు. సేన కార్యకర్తలు కూడా దసరా ర్యాలీలో ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కీలక ప్రాంతాల్లో నిఘా వేశారని సమాచారం. షరతులతో కూడిన అనుమతి లభించడంతో.. ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించకుండా శివసేన జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సభ వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. -
జోషికి భవిష్యత్‌పై బెంగ
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి అనేక కీలక పదవులు చేపట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై నుంచి టికెటు నిరాకరించడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే నన్ను అడగకుండానే అనేక పదవులు కట్టబెట్టారు. ఆయన కొడుకు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రం టికెట్‌ను కూడా నిరాకరించారు’ అని ఓ టీవీ చానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ శివసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల గణేశ్ ఉత్సవాల సమయంలో దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో బీఎంసీ స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు కావడంపై జోషి అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన మాతోశ్రీ బంగ్లాకు చేరుకుని ఉద్ధవ్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఉద్ధవ్ శేవాలేకు సర్దిచెబుతారని ఆయన భావించినా, అలా ఏమీ జరగలేదు. ఆ తరువాత ఉద్ధవ్ వీళ్లిద్దరినీ ఎదురుఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి వాగ్వాదాలు వద్దంటూ సర్దిచెప్పారు. దీంతో శేవాలేకు మాతోశ్రీ అండ ఉందనే విషయం జోషికి తెలిసిపోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తన కు పూర్వవైభవం వస్తుందని జోషి విశ్వసిస్తున్నారు. ములాయంసింగ్, జయలలిత, మమతా బెనర్జీ వంటి నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని జోషి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అదృష్టం వరిస్తే తను రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అంతదూరం వెళ్లాలంటే ముందు ఇక్కడ టికెటు రావడం తప్పనిసరని జోషి వివరించారు.