సాక్షి, ముంబై: గుజరాతీయులకు వ్యతిరేకంగా సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావుత్‌కు చిక్కులు తప్పేలా లేవు. సామ్నాలో ఆయనకు అధికారాలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని గుజరాత్ ప్రజలపై రావుతే రాసిన సంపాదకీయంపై ఉద్ధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయమై అధికారికంగా వివరాలు అందకపోయినా, ప్రస్తుత పరిస్థితులను బట్టి రావుత్ అధికారాలను తగ్గించడం ఖాయమని భావిస్తున్నారు. శివసేన అధికార పత్రిక సామ్నా వర్కింగ్ ఎడిటర్‌గా సంజయ్ రావుత్ విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే.
గుజరాతీ ప్రజలను విమర్శిస్తూ ఈ నెల ఒకటిన ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సంపాదకీయంతో ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన భార్యతో యూరప్ పర్యటనలో ఉన్నారని సేన వర్గాలు వివరణ ఇచ్చాయి. సంపాదకీయంలో ఏం రాసినా, అది శివసేన అధికార వైఖరేనని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలు, ఇతర విషయాలన్నీ సామ్నా ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తెలియజేసేవారు. అయితే గుజరాతీలపై రాసిన సంపాదకీయంపై తీవ్ర విమర్శలు రావడంతో ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. వివాదాస్పద సంపాదకీయంతో శివసేన పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు.
సామ్నా.. శివసేన అధికారిక పత్రిక కాదని, ఇటీవలి సంపాదకీయంలో పార్టీ ప్రమేయం లేదన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని సామ్నా విమర్శించడం తెలిసిందే. దీనిపై గత రెండు రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలూ లేవని, పార్టీ నాయకులందరిలోనూ ఇదే అభిప్రాయముందని ఉద్ధవ్ స్వయంగా చెప్పారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు పరస్పర సహాయసహకారాలు అందించుకునేవారని అన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన గుజరాత్‌లో సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలను పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందని ఠాక్రే అన్నారు. ప్రస్తుత పరిణామాలతో సేన కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఈ వివాదానికి కారణమైన సంజయ్ రావుత్‌కు సామ్నాపై ఉన్న అధికారాలను కొంత తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సామ్నా పత్రిక విధుల్లో కొన్నింటిని చేపట్టాలని శివసేన నాయకులు సుభాష్ దేశాయి, లీలాధర్ డాకేను కూడా ఆదేశించినట్టు సమాచారం. రావుత్‌కు అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పార్టీ రహస్యాలు ప్రత్యర్థులకు తెలిసిపోతున్నాయని కొందరు ఉద్ధవ్ ఠాక్రేకు చెప్పినట్టు తెలిసింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా గుజరాతీయులపై రాసిన సంపాదకీయంతో మరింత అసంతృప్తికి గురైన ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సుభాష్ దేశాయి, లీలాధర్ డాకే కు పత్రికలో కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిసింది. రెండు రోజుల క్రితమే వారు బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం.
సంపాదకీయంతో సమస్యలు
Published Tue, May 6 2014 10:28 PM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM
Advertisement