ముంబై: చివరి విడత లోక్‌సభ ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రజాస్వామ్య కూటమి, మహాకూటములు ఈ సందర్భంగా ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవడంలేదు. తమ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేస్తున్న ర్యాలీల్లో భారీగా జనాలు పాల్గొనేలా చూసుకుంటున్నారు. దీనికోసం కోట్లాది రూపాయల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టేందుకు సైతం ఆయా పార్టీలు వెనుకాడటంలేదు.
విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగనున్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ బహిరంగ సభ నిమిత్తం కేవలం గ్రౌండ్ కోసం ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్‌సీసీ) ఎమ్మెమ్మార్డీయేకు రూ.30 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎంఆర్‌సీసీ చీఫ్ జనార్ధన్ చందూర్కర్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా భారీ ర్యాలీ కాబట్టి దాని కోసం భారీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.. అందువల్ల ఆ మాత్రం ఖర్చు తప్పదు..’ అని తెలిపారు. అలాగే ఈ ర్యాలీలో ప్రజాస్వామ్య కూటమి భాగస్వాములైన ఎన్‌సీపీ,ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే నాయకత్వంలోని ప్రజా రిపబ్లికన్ పార్టీల ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటున్నారని చందూర్కర్ తెలిపారు.
ఈ భారీ ర్యాలీ కోసం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే 5 వేలమందిని తరలించాలని పార్టీ శాఖ ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, వారందరికీ పార్టీ టార్గెట్ నిర్ణయించిందని, సుమారు నాలుగు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా కాషాయ కూటమి కూడా ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడంలేదనే తెలుస్తోంది. ప్రజాస్వామ్య కూటమి ర్యాలీకి దీటుగా ఈ నెల 21వ తేదీన కాషాయ కూటమి సైతం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దీనికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు. కాగా ఈ ర్యాలీ కోసం రూ.34 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. కాగా, నగరంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో నగరంలోని 6 లోక్‌సభ స్థానాల్లో ఐదింటిని ఈ పార్టీ గెలుచుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎన్సీపీ ఎగరేసుకుపోయింది.
19 స్థానాల్లోనూ ఉద్దండుల ప్రచారం..
రాష్ట్రంలోని 19 లోక్‌సభ స్థానాల్లో చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు అంజలి దమానియా తమ పార్టీ ఉత్తర ముంబై అభ్యర్థి సతీష్ జైన్ కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే మూడు రోజులపాటు ఆమెతోపాటు పలువురు ఆప్ నాయకులు ముంబైలోని అన్ని నియోజకవర్గాలతోపాటు, కొంకణ్, ఉత్తర మహారాష్ర్ట ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.
కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. మొదటి దఫా ఎన్నికల్లో పార్టీ చీఫ్ సోనియాగాంధీ విదర్భలో ప్రచారం చేశారు. ఈ దఫా కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలైన నందూర్బర్, ధులేల్లో జరిగే ర్యాలీల్లో ప్రచారం చేయనున్నారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా మొదటిసారి ముంబైలో జరుగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొననున్నారు. కాషాయ కూటమి భాగస్వామి అయిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం సాయంత్రం కల్యాణ్(ఠాణే)లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, చివరి విడతలో 338 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 43,343 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాటుచేశారు.
చివరి పోరు.. అమీతుమీ
Published Fri, Apr 18 2014 10:54 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement