దక్షిణముంబై నుంచి జోషి పోటీ?
Published Sun, Aug 11 2013 12:03 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
సాక్షి, ముంబై: శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషిని లోకసభ ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విషయమై సేనలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరాఠీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న శివసేనకు పెట్టనికోటగా భావించే దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తెలిసింది. దీంతో మరాఠీ ఓట్లను చీల్చే సత్తా ఉన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)ను కూడా అడ్డుకునేందుకు వీలుందని సేన భావిస్తోంది. శివసేనకు పట్టున్న దాదర్ ప్రాంతంలో ఎమ్మెన్నెస్ ప్రభావం కొంతమేర పెరిగింది. ఈ నేపథ్యంలో శివసేన ఇక్కడి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని తెలిసింది.
ఈ నేపథ్యంలోనే ముందుగా కళ్యాణ్ లోకసభ నుంచి బరిలోకి దింపాలనుకున్న మనోహర్ జోషిని దక్షిణ ముంబై లోకసభ నుంచి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. మనోహర్ జోషి సీనియర్ నాయకుడు కావడంతోపాటు రాజ్‌ఠాక్రేతో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బరిలోకి దింపితే, జోషికి వ్యతిరేకంగా ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపబోదని భావిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా భావించే ఈ నియోజకవర్గాన్ని మనోహర్ జోషి కోసం ఎమ్మెన్నెస్ వదులుకుంటుందా అనేది మాత్రం సందేహాస్పదమే. ముందుగా భావించినట్టు సురేష్ ప్రభు, సంజయ్ రావుత్, సూర్యకాంత్ మాడిక్‌ను కాకుండా మనోహర్ జోషిని బరిలోకి శివసేన దింపుతుందా..? అనే విషయంపై సేన ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే దక్షిణ ముంబై నుంచే తానూ పోటీ చేస్తానని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధిపతి రాందాస్ అథవలె చెబు తున్నారు. ఆర్పీఐ మహాకూటమిలో భాగస్వామి కావడంతో శివసేన ఈ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో అథవలె ఓటమిపాలు కావడంతో ఈసారి దక్షిణ ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ కూడా మహాకూటమిలో భాగస్వామి అనే విషయం తెలిసిందే.
Advertisement
Advertisement