అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు | rahul shevale won in loksabha elections | Sakshi
Sakshi News home page

అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు

Published Sat, May 17 2014 11:18 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు - Sakshi

అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు

 కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగిన రాహుల్ శెవాలే
 

 సాక్షి. ముంబై: బీఎంసీ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాహుల్ శెవాలే  అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్‌జోషీనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే టికెట్ కేటాయించారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గెలుపుకోసం కృషి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడైన ఏక్‌నాథ్ గైక్వాడ్‌పై ఘనవిజయం సాధించారు. దీంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆస్కారం లభించింది. దక్షిణ మధ్య ముంబై లోకసభ నియోజకవర్గం శివసేనకు పెట్టనికోట. కానీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పరాజయం పాలైంది.

ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్న శివసేన ఈసారి లోకసభ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మనోహర్ జోషీని కాదని రాహుల్ శెవాలేను బరిలోకి దింపింది. శివసేన అభ్యర్థిగా తాను మళ్లీ ఇక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం చాలా ఆనందం కలిగించిందని రాహుల్ శెవాలే అన్నారు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కలను సాకారం చేశాననే తృప్తి ఉందన్నారు. రాహుల్ శెవాలే తల్లి  జయశ్రీ శెవాలే ఎమ్టీఎన్‌ఎల్ ఉద్యోగి కాగా, తండ్రి రమేష్ శెవాలే నౌకాదళం అధికారి. సివిల్ ఇంజనీర్ అయిన రాహుల్ శివసేనలో చేరి 2002లో కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2004లో అతనికి ప్రభాగ్ సమితి అధ్యక్షుని పదవి లభించింది. ఇలా ఒక్కో మెట్టుపైకి ఎదిగిన ఆయన 2005లో అణుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం ఆయన మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement