rahul shevale
-
అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు
కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగిన రాహుల్ శెవాలే సాక్షి. ముంబై: బీఎంసీ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాహుల్ శెవాలే అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్జోషీనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే టికెట్ కేటాయించారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గెలుపుకోసం కృషి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడైన ఏక్నాథ్ గైక్వాడ్‌పై ఘనవిజయం సాధించారు. దీంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆస్కారం లభించింది. దక్షిణ మధ్య ముంబై లోకసభ నియోజకవర్గం శివసేనకు పెట్టనికోట. కానీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పరాజయం పాలైంది. ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్న శివసేన ఈసారి లోకసభ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మనోహర్ జోషీని కాదని రాహుల్ శెవాలేను బరిలోకి దింపింది. శివసేన అభ్యర్థిగా తాను మళ్లీ ఇక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం చాలా ఆనందం కలిగించిందని రాహుల్ శెవాలే అన్నారు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కలను సాకారం చేశాననే తృప్తి ఉందన్నారు. రాహుల్ శెవాలే తల్లి జయశ్రీ శెవాలే ఎమ్టీఎన్ఎల్ ఉద్యోగి కాగా, తండ్రి రమేష్ శెవాలే నౌకాదళం అధికారి. సివిల్ ఇంజనీర్ అయిన రాహుల్ శివసేనలో చేరి 2002లో కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2004లో అతనికి ప్రభాగ్ సమితి అధ్యక్షుని పదవి లభించింది. ఇలా ఒక్కో మెట్టుపైకి ఎదిగిన ఆయన 2005లో అణుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఆయన మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
టెర్రెస్‌పై షెడ్డులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ముంబై: భవనాల టెర్రెస్‌పై షెడ్డు నిర్మించేందుకు ఆయా సొసైటీల యాజమాన్యాలకు అనుమతివ్వాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది. అందుకు అవసరమైన నియమ, నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై వచ్చే సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుని మంజూరు నివ్వనున్నట్లు స్థాయి సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే తెలిపారు. సాధారణంగా భవనాల్లో ఆఖరు అంతస్తులో ఇళ్లు కొనుగోలు చేయాలన్న లేదా అద్దెకు ఉండాలన్నా ప్రజలు జంకుతారు. వేసవి కాలంలో టెర్రెస్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇంట్లో విపరీతమైన వేడిమి, ఉక్కపోత భరించలేని విధంగా ఉంటుంది. సాయంత్రమైందంటే టెర్రెస్‌ను నీటితో తడపాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో లీకేజీ బెడద, గోడలు తడిగా మారడంతో విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ బెడద నుంచి తప్పుకునేందుకు సొసైటీల్లో ఆఖ రు అంతస్తులో ఫ్లాట్గాని చాళ్లలో ఇళ్లు గాని కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనకడుగు వేస్తారు. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కల్గించేందుకు టెర్రెస్లపై షెడ్డు నిర్మించుకునేందుకు సొసైటీ యాజమాన్యాలకు అనుమతివ్వాలని యోచిస్తున్నట్లు శేవాలే స్పష్టం చేశారు. ఒకవేళ స్థాయి సమితి సభలో మం జూరు లభిస్తే నివాసులకు వేసవి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి విముక్తి లభించనుంది. బీఎంసీ నియమాలు కొంత కఠినంగా ఉండడంవల్ల షెడ్డు నిర్మాణానికి అనుమతిచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈనియమాల్లో మార్పులు చేసి అనుమతిచ్చేందుకు మార్గం సుగమం చేయాలని బీఎంసీ యోచిస్తోంది. దీని కారణంగా బీఎంసీ ఖజానాలోకి అదనంగా రెవెన్యూ వచ్చి చేరనుంది.