సాక్షి, ముంబై:
దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే స్మారకాన్ని శివాజీపార్క్‌లోనే నిర్మిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఆయన స్మృతి స్మారక నిర్మాణ పనులు అనుకున్న సమయానికి నవంబర్ 17వ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు నగర మేయర్ సునీల్ ప్రభు, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలేతో కుంటే భేటీ అయ్యారు. బాల్‌ఠాక్రే ప్రథమ వర్థంతి జరిగే నవంబర్ 17వ తేదీ లోపే స్మారకం నిర్మించి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ స్మారకం చుట్టూ ఉద్యానవనం ఉంటుంది. ఈ స్థలం సీఆర్‌జెడ్ (తీర ప్రాంత నియంత్రణ మండలి) పరిధిలోకి రావడంతో బాల్‌ఠాక్రే స్మారక నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సంబంధిత శాఖకు పంపించాం.
ఉద్యానవనంలో నిర్మించే స్మారక నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాపు హెరిటేజ్ కమిటీకి పంపించాం. దీంతో అన్ని పనులు నియమాలకు లోబడి అధికారికంగా కొనసాగుతుండడంతో ఈ స్మారకం నిర్మించేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావ’ని సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఈ స్మారకం నిర్మాణానికి అవసరమయ్యే అన్ని అనుమతులు బీఎంసీ పరిపాలన విభాగం ప్రభుత్వం నుంచి తీసుకుందని సునీల్ ప్రభు వివరించారు. పనులన్నీ నియమాలకు లోబడే సాగుతున్నాయని, దీనిపై వివిధ రాజకీ య పార్టీలు అనవసరంగా రాజకీయం చేసి లబ్ధిపొందే ప్రయత్నం చేయవద్దని రాహుల్ శేవాలే అన్నారు. కాగా, బాల్‌ఠాక్రే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై అనేక తర్జన భర్జనలు జరిగాయి.
దాదాపు 40 ఏళ్ల క్రితం పార్టీ అవిర్భవించిన నాటి నుంచి ఏటా దసరా రోజున శివాజీ పార్క్ మైదానంలో శివసేన భారీ ర్యాలీ జరిగేది. దీంతో ఈ మైదానంతో ఠాక్రేకు అవినావ భావం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఠాక్రేకు అంత్యక్రియలు నిర్వహిస్తామని శివసేన నాయకులు పట్టుబట్టారు. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే నియయనిబంధనలు అడ్డువచ్చాయి. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో శివాజీపార్క్ మైదానంలో ఠాక్రే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఈ ప్రాంతాన్ని ఠాక్రే అభిమానులు దర్శించుకునేందుకు అక్కడ గద్దె నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ప్రతీరోజు వేలాది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ గద్దెను సందర్శించి వెళుతుండేవారు. దీంతో ఠాక్రే స్మృతి స్మారకాన్ని ఇక్కడే నిర్మించాలని శివసేన నాయకులు పట్టుబట్టారు. తర్వాత అనేక రంగాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావడంతో మార్గం సుగమమైంది.
శివాజీపార్క్‌లోనే బాల్‌ఠాక్రే స్మారకం
Published Sat, Sep 14 2013 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement