నేటి నుంచి హైదరాబాద్‌లో ఉచిత వైఫై
పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గురువారం సాయంత్రం 5.15 గంటలకు హోటల్ మారియట్‌లో ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో(ఫేస్‌టైం) కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుకు బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్తంగా సేవలు అందించనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని, ఒకేసారి 2,500 మంది లాగిన్ కావచ్చని అధికారులు తెలిపారు.2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఉచిత వైఫై సేవలు లభిస్తాయని, ఒక్కో పౌరుడు 30 నిమిషాలు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వివరించారు.