
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్‌సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కాగా నేడు విచారణలో భాగంగా స్టేషన్ మేనేజర్ రవీందర్, డివిజన్ రీజనల్ మేనేజర్ ఎన్‌వీఎస్ ప్రసాద్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్‌లు రైల్వేసేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు.
విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని విచారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ రైల్‌భవన్‌లో ఈ ఘటనపై అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు.