సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం (13న) ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలెట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసుల అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ రైలును లోకోపైలట్ మూవ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్‌ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
ఇక, రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై కేసులను నమోదు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment