సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. శనివారం ఇక్కడి రైల్వే భవన్‌లో దక్షిణాది రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ ఏర్పాటుకు సంబంధిత రాష్ట్రాలతో, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
అలాగే విశాఖ-ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు గమ్యాన్ని చేరుకునేందుకు దాదాపు 36 గంటలు పడుతోందని, దీని సమయాన్ని కుదించాలని వస్తున్న వినతులను పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష లేదని, యూపీఏ హయాంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ కేటాయింపులు చేశామన్నారు. రైల్వే బోర్డులోని ఉన్నతాధికారులతో రాష్ట్రాలకు సమన్వయ కర్తలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేశాఖ సమన్వయ కర్తగా రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రతానాథ్‌ను నియమించినట్టు వివరించారు.