మెట్టుగూడ–ఎస్.ఆర్.నగర్ లైన్‌ను పరిశీలిస్తున్న రైల్వే సేప్టీ బృందం (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.) మార్గంలో భద్రతా ధ్రువీకరణ జారీ చేయడంతో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. మెట్రో ప్రాజెక్టును ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే నాగోల్–మెట్టుగూడ, మియాపూర్–ఎస్.ఆర్. నగర్ రూట్లో భద్రతా ధ్రువీకరణ మంజూరైంది.
తాజాగా సోమవారం మెట్టుగూడ–ఎస్.ఆర్.నగర్ మార్గానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మార్గానికి సంబంధించి ఇటీవల ట్రాక్, సిగ్నలింగ్, విద్యుదీకరణ వ్యవస్థను కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత భద్రతా ధ్రువీకరణ జారీచేసింది. కాగా మరో వారంలో ప్రారంభంకానున్న రెండు మార్గాల్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. రెండు రూట్లలో 20 రైళ్లను నడపనున్నారు. ఈ 30 కి.మీ. మార్గంలో 24 స్టేషన్లున్నాయి. కాగా భద్రతా ధ్రువీకరణ రాకతో ఇప్పుడు అందరి దృష్టి మెట్రో రైలు కనిష్ట, గరిష్ట చార్జీలు, పార్కింగ్ ఫీజులపైకి మళ్లింది. నేడో రేపో ఈ ధరలను సైతం ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment