రైలు నడుపుతున్న సుప్రియ సనమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెట్రో రైలు ప్రయాణానికి తెలంగాణ అమ్మాయి ఎస్.సుప్రియ సనమ్ సారథిగా నిలిచి పలువురి మన్ననలు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ మెట్రోను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేకంగా అలంకరించిన మెట్రో రైలులో సీఎం కేసీఆర్ తదితరులతో కలసి మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు 5 కి.మీ. దూరం ప్రయాణించారు. ఈ రైలును సుప్రియ సనమ్(లోకోపైలట్) నడిపారు. ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన సుప్రియ స్వస్థలం నిజామాబాద్. ఆమె వయసు 25 ఏళ్లు.. నగరంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదివారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె రెండేళ్ల క్రితం మెట్రో రైళ్ల నిర్వహణ సంస్థ కియోలిస్ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో లోకోపైలట్‌గా ఎంపికయ్యారు. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ తదితర అంశాల్లో శిక్షణ పొంది.. మెట్రో రైళ్లను నడపడంలో సుశిక్షితురాలయ్యారు. ప్రధాని ప్రయాణించిన తొలి రైలును నడపడం ఎంతో ఉద్విగ్నంగా.. పట్టరానంత సంతోషంగా ఉందని సుప్రియ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రియతో పాటు ఈ రైలుకు కో–లోకోపైలట్‌గా ఎం.రాజశేఖరాచారి వ్యవహరించారు. ఆయన స్వస్థలం హైదరాబాదే. ప్రధాని ప్రయాణించిన రైలును నడపడం తన జీవితంలో మరపురాని అనుభూతి అని రాజశేఖరాచారి ఉద్విగ్నంగా చెప్పారు.
15 నెలల తర్వాత..
సుమారు 15 నెలల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి విచ్చేశారు. రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధానికి పుష్కగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, సి.లక్ష్మారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కృష్ణంరాజు, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులను సీఎం కేసీఆర్ పేరుపేరునా ప్రధానికి పరిచయం చేశారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతల మధ్య ప్రధాని స్వాగత కార్యక్రమం సందడిగా మారింది.
తెలంగాణకు రెండో సారి..
ప్రధాని అయ్యాక మోదీ తెలంగాణకు రావడం ఇది రెండో సారి. 2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్ పర్యటనకు వ చ్చిన ఆయన.. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో పాల్గొ న్నారు. ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం, కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణం, రామగుండంలో ఎఫ్‌సీఐల్ కర్మాగారం నిర్మాణం తదితరాలకు శంకుస్థాపన చేశారు. గజ్వేల్ బహిరంగ సభలో, అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలోనూ ప్రసంగించారు. తాజా పర్యటనలో భాగంగా బేగంపేటలో బీజేపీ నిర్వహించిన కార్యకర్తల సభలో మోదీ ప్రసంగించారు. అనంతరం మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభించారు. తర్వాత హెచ్‌ఐసీసీకి వెళ్లి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అటునుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment