సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీలోని తమ ప్రభుత్వం అభివృద్ధి, పరిపాలన విషయంలో రాష్ట్రాల మధ్య తేడా చూపబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా సహకార, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం ద్వారా దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను ఏనాడూ తక్కువ చేయకుండా అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. భుజం భుజం కలిపి అభివృద్ధి కోసం ఇదే సంకల్పంతో పని చేస్తామని అన్నారు.
మెట్రోరైలు ప్రారంభోత్సవం, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి మంగళవారం హైదరాబాద్ వచ్చిన మోదీ.. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన సభలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణను అభివృద్ధి చేసి, ప్రజలకు సేవ చేసుకునేందుకు తమకు పరిపాలించే అధికారం రాలేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా, తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా శాసనాధికారాలు రాలేదన్నారు. ఏడు దశాబ్దాలపాటు అధికారం రాకున్నా ప్రజల సమస్యలు, అభివృద్ధి కోసం సంఘర్షణ చేసే మార్గాన్ని బీజేపీ కార్యకర్తలు ఏనాడూ వీడలేదని చెప్పారు.
‘‘భరతమాత సేవ కోసం, బీజేపీ కోసం, కమలం గుర్తు కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న కార్యకర్తలు అభినందనీయులు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తాం. ఇప్పుడు అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తాం’’అని అన్నా రు. అంతర్జాతీయ సదస్సు కోసం ప్రపంచం అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంద న్నారు. అతితక్కువ సమయంలోనే తన కార్య క్రమం గురించి తెలిసినా ఇంత పెద్ద స్వాగతం పలికినందుకు తాను అదృష్టవంతుడినన్నారు.
మోదీ.. యుగపురుషుడు: లక్ష్మణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ప్రధాని మోదీదేనన్నారు. దౌత్యపర చాకచక్యంతో చైనాకు గుణపాఠం చెప్పిన యుగపురుషుడు మోదీ అని కొనియాడారు. తెలంగాణ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్న మోదీ హైదరాబాద్ పర్యటన తమ అదృష్టమన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేపీ శాసనసభా పక్షనాయకుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణదాసు పాల్గొన్నారు.
సోదర, సోదరీమణులారా.. !
ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగుతోనే ప్రారంభించారు. ‘‘సోదర, సోదరీమణులారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తుకొస్తారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన సర్దార్ పటేల్‌కు ఈ వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు నా జోహార్లు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది’’అని అన్నారు. ఆ తర్వాత హిందీలో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment