ప్రతిపాదనల కసరత్తు ప్రారంభించని ప్రభుత్వం
ఇప్పటికే ముసాయిదా బడ్జెట్ ప్రక్రియ మొదలుపెట్టిన రైల్వే బోర్డు
ఇదే నిర్లక్ష్యంతో గతంలో రాష్ట్రానికి తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల వరుసగా రెండు రైల్వే బడ్జెట్‌లలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా కిరణ్ సర్కారు ఇంకా నిర్లక్ష్య ధోరణిని వీడట్లేదు. 2014 రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తును రైల్వే బోర్డు ఇప్పటికే ప్రారంభించినా ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనలను సిద్ధం చేయలేదు. స్థానిక ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్‌కు కనీసం మూడు నెలల ముందైనా ప్రతిపాదనలు పంపాలన్న రైల్వేశాఖ సూచనను ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. రాష్ట్ర విభజన అంశం తుది దశలో ఉండటంతో అన్ని పార్టీల నేతలు ఆ విషయంలోనే బిజీగా ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశాన్ని ఇప్పటికే పక్కన పెట్టిన సీమాంధ్ర నేతలు కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించుకునే పనిలో పడ్డారు. ఈ దిశలోనే వారు సీమాంధ్రకు ప్రత్యేక జోన్ కావాలనే విషయాన్ని కేంద్రం ముందుంచారు. ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో సహా సీమాంధ్రకు ప్రత్యేక జోన్ ప్రకటించాలని వారు గ ట్టిగా కోరుతున్నారు. ఈ డిమాండ్ మినహా పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, ప్రాజెక్టులపై ఎలాంటి ప్రతిపాదనలను సిద్ధం చేయటం లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా నేతలెవరూ ఇప్పటి వరకూ ప్రతిపాదనల విషయాన్ని పట్టించుకోలేదు.
ఇంత దారుణమా...
రెండు దశాబ్దాల క్రితం మంజూరైన పెద్దపల్లి-నిజామాబాద్ లైను, పుష్కర కాలం క్రితం మంజూరైన విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్-మచిలీపట్నం డబ్లింగ్ పనులు, ట్రాఫిక్ తీవ్రతను తట్టుకోలేకపోతున్న కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులు... లాంటివి ముందుకు సాగకపోవటానికి మన నుంచి ఒత్తిడి లేకపోవటమే కారణమనే సంగతి రాష్ట్ర ప్రభుత్వానికీ తెలుసు. ఐదేళ్ల క్రితం మంజూరైనా నేటికీ ఇటుక కూడా పడని కాజీపేట వ్యాగన్ యూనిట్ దుస్థితికి కారణమైన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవటంలో విఫలమై ప్రయాణికుల కష్టాలను రెట్టింపు చేస్తోంది.
రైల్వే బడ్జెట్‌లో మళ్లీ అన్యాయమేనా?
Published Sun, Dec 1 2013 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement