రైలు చార్జీలు పెంచుతారా?
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ రైల్వే వ్యవస్థ అదనపు ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలు పెంచుతుందా ? అన్న అంశంపై ప్రయాణికుల ఆసక్తి పెరిగింది. గతేడాది ప్రయాణికుల చార్జీలను వదిలేసి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సరకు రవాణా చార్జీలను పెంచారు. అనంతరం ఏడాది మధ్యలో ప్రయాణికుల ఫస్ట్‌క్లాస్, ఏసీ కోచ్‌ల చార్జీలను సెస్ రూపంలో పెంచారు. ఇప్పుడు కూడా అలాంటి వైఖరినే అవలంబిస్తారా ?
గత ఏడాది బడ్జెట్‌లో సురేశ్ ప్రభు ఎలాంటి కొత్త రైళ్లను ప్రవేశపెట్టక పోయినప్పటికీ ఆశించిన టార్గెట్‌లు నెరవేరలేదు. ప్రయాణికులు, సరకు రవాణా చార్జీల వల్ల 1,41,416 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1,36, 079 కోట్ల రూపాయల రెవెన్యూ మాత్రమే వచ్చింది. రెవెన్యూలో 3.77 శాతం తగ్గుదల కనిపించింది. ప్రతి వంద రూపాయల రెవెన్యూకు ఖర్చును 85.5 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఖర్చు మాత్రం 97.8 రూపాయలకు పెరిగింది. ప్రయాణికులు, సరకు రవాణా లక్ష్యాలు కూడా ఆమడ దూరంనే ఉండిపోయాయి. వచ్చే మార్చినెల నాటికి 8.50 కోట్ల టన్నుల సరకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గత డిసెంబర్ నెల నాటికి కేవలం 80 లక్షల టన్నుల సరకును మాత్రమే రవాణా చేసింది. మిగతా లక్ష్యాన్ని అందుకునే ఆస్కారమే లేదు.
దిగజారిన ఆర్థిక పరిస్థితి కారణంగా జనరల్ బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సిందిగా రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తిని ఆర్థిక శాఖ త్రోసిపుచ్చింది. పైగా గతంలోకన్నా 30 శాతం కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. కనీసం గ్రాంట్ రూపంలో ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. కేంద్రానికి చెల్లించాల్సిన 8,000 కోట్ల రూపాయల డివిడెంట్‌ను మాఫీ చేయాల్సిందిగా కోరినా ససేమిరా అంది. స్వయంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చింది. ఈ పరిస్థితికి తోడు ఏడవ వేతన సంఘం సిపార్సులను ఉద్యోగులకు అమలు చేయడం వల్ల రైల్వేలపై ఈ ఏడాది అదనంగా 32,000 కోట్ల రూపాయల భారం పడనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ కారణంగా పడే భారం దీనికి అదనం.
ఇంతటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం లేదని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక హంగులుగల బోగీలను ప్రవేశపెడతామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించినందున వాటిని ప్రవేశపెట్టి వాటిపై అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలతో పాటు ప్రయాణికుల చార్జీలను పెంచేందుకు సురేశ్ ప్రభు మొగ్గు చూపుతున్నా రాజకీయ కారణాలు అందుకు సహకరించడం లేదు.
రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల చార్జీలను ఇప్పుడు పెంచకపోవచ్చని, ఎన్నికలు అయిన వెంటనే కచ్చితంగా పెంచుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా స్పష్టమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రెయిన్ల సంగతి మాట పక్కన పెడితే ఈసారి కూడా ఎదుగు బొదుగులేని బడ్జెట్‌నే ఆవిష్కరిస్తారని అర్థమవుతుంది.