భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్లు దాటినా కొత్త రైళ్లు పట్టాలెక్కడంలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఇప్పటికీ ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది, అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి న్యూఢిల్లీకి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అంబాటులో ఉంది. దీంతో ప్రయాణికులు ఈ ఒక్క రైల్లో బెర్తు కోసం నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం చర్విత చర్వణంగా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కొత్త రైళ్లు మాత్రం రావడం లేదు. తాజాగా కేంద్రం మరో మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా చారిత్రక హైదరాబాద్ నుంచి తెలంగాణ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఏదీ సంపర్క్ క్రాంతి...
► ఏపీ, తమిళనాడు, కర్ణాకటక, కేరళ తదితర అన్ని రాష్ట్రాల నుంచి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12708/12707) తిరుపతి నుంచి నిజాముద్దీన్ స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తోంది. ఇది కాచిగూడ మీదుగా అందుబాటులో ఉన్నప్పటికీ బెర్తులు లభించడం కష్టమే.
► మరోవైపు అన్ని రాష్ట్రాలకు చెందిన రాజధానులు లేదా పుణ్యక్షేత్రాల నుంచి సంపర్క్‌క్రాంతి రైళ్లు నడిపినప్పుడు తెలంగాణ నుంచి కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
► ప్రస్తుతం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాంపల్లి నుంచి కాజీపేట్, బల్లార్ష మీదుగా నడుస్తోంది. తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షల మీదుగా డెహ్రాడూన్ మార్గంలో నడిపితే ఇప్పటి వరకు న్యూఢిల్లీకి నేరుగా రైలు సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’)
కొత్త రైళ్లేవీ?
► మరోవైపు హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంద వందేభారత్ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ– వారణాసి, న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి ఆలయానికి మాత్రమే ఈ రైళ్లు గతేడాది నుంచి నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ను సికింద్రాబాద్ నుంచి న్యూఢిలీకి నడపాలనే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు.
► మరోవైపు హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా మరో వందేభారత్ రైలును ముంబై వరకు నడిపాలనే ప్రతిపాదన సైతం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
► మొత్తం 18 బోగీలు ఉండే ఈ ట్రైన్లో జీపీఎస్ అధునాతన సదుపాయాలు ఉంటాయి.
► సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రెండేళ్ల క్రితం నిలిపివేశారు. ఎంతో డిమాండ్ ఉన్న ఈ ట్రైన్ నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పుణే– సికింద్రాబాద్ మార్గంలో లైన్ల సామర్థ్యాన్ని పెంచి సత్వరమే శతాబ్ది రైలును పునరుద్ధరించాల్సి అవసరం ఉంది.
ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఏడేళ్లలో కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. పైగా ఉన్నవాటిని రద్దు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి.
– ఫణి, సాఫ్ట్వేర్
వందేభారత్ నడపాలి
దక్షిణాదిలో ఇప్పటి వరకు వందే భారత్ రైలును ప్రవేశపెట్టలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి లేదా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలకు వందేభారత్‌ను నడపాలి. దీనివల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.
– సునీల్, వికారాబాద్