వృద్ధికి రైలు కూత... | The growth of the rail howl ... | Sakshi
Sakshi News home page

వృద్ధికి రైలు కూత...

Published Fri, Feb 26 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

వృద్ధికి రైలు కూత...

వృద్ధికి రైలు కూత...

కొత్త ఫ్రైట్ కారిడార్లతో
తగ్గనున్న రవాణా వ్యయం
రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం సవాలే...
రైల్వే బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాల స్పందన...

  
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్.. ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. 2019కల్లా ఏర్పాటు కానున్న  మూడు కొత్త ఫ్రైట్ కారిడార్ల(సరుకు రవాణా)తో రవాణా వ్యయం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం గట్టి సవాలేనని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. కొత్తగా మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్‌పూర్-ముంబై), ఈస్ట్‌కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు.

‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం చాలా ఎక్కువ. జీడీపీ వృద్ధికి ఆటంకాలు, ఇతరత్రా అంశాలను చూస్తే.. ఈ లక్ష్యం పెద్ద సవాలే. పే కమిషన్ సిఫార్సుల ప్రభావం రైల్వేలపై రూ.30 వేల కోట్ల వరకూ పడుతుంది. అయినప్పటికీ 92% నిర్వహణ పనితీరును సాధించాలన్న లక్ష్యం సవాలుతో కూడుకున్నదే. 2019 కల్లా కొత్త ఫ్రైట్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం గొప్పదే కానీ, అనేక సవాళ్లు ఉన్నాయి’ అని ఎల్‌అండ్‌టీ సీఈఓ(రైల్వే బిజినెస్) రాజీవ్ జ్యోతి పేర్కొన్నారు.

పోర్టు కనెక్టివిటీ పెంపుపై ఎగుమతిదారుల హర్షం
పోర్టులతో మరింత అనుసంధానం అయ్యేవిధంగా రైల్వే నెట్‌వర్క్ పెంచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని ఎగుమతిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ట్రేడర్లకు ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పారు. రైల్వే లైన్లకు అనుసంధానంగా గిడ్డంగుల ఏర్పాటు ప్రతిపాదనల వల్ల ఫ్రైట్ టెర్మినళ్ల వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కోల్డ్ స్టోరేజీల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) పేర్కొంది. రైల్వేలకు పోర్టులతో కనెక్టివిటీ పెంపువల్ల ఎగుమతి, దిగుమతిదారులకు వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుందని, తద్వారా వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఈఈపీసీ) వ్యాఖ్యానించింది. అదేవిధంగా లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కూడా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ టీఎస్ భాసిన్ పేర్కొన్నారు.


ఫ్రైట్ కారిడార్లు, స్టేషన్ల అభివృద్ధితో రియల్టీకి బూస్ట్
 ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, 400 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి వీలుగా బడ్జెట్‌లో ప్రతిపాదించడాన్ని రియల్ ఎస్టేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల రియల్టీ మార్కెట్‌కు చేయూత లభిస్తుందని ప్రాపర్టీ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. అయితే, వీటికి నిధులు సమకూర్చడం, నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాజెక్టులను పూర్తిచేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘400 స్టేషన్లను పీపీపీ విధానంలో ఆధునీకరించనుండటం వల్ల దేశవ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో రియల్టీ అభివృద్ధికి వీలు కలుగుతుంది. పెద్ద నగరాల్లో రైల్వే శాఖకు ఉన్న భారీ స్థలాలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు’ అని జేఎల్‌ఎల్ ఇండియా చైర్మన్, కంట్రీ హెడ్ అనుజ్ పురి పేర్కొన్నారు.
  
సాహసోపేతమైన ముందుచూపు..
ప్రధానంగా ప్రాజెక్టుల పూర్తి, అమలుపై బడ్జెట్‌లో అత్యధికంగా దృష్టిపెట్టడం మంచి పరిణామం. కొత్తగా మూడు రైల్వే ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుతో రవాణా వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, భద్రతపై దృష్టిపెడుతూ సాహసోపేతమైన ముందుచూపుతో రూపొందించిన బడ్జెట్ ఇది. వృద్ధికి ఊతమిస్తూ.. పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలను కల్పించారు. - సుమిత్ మజుందార్, సీఐఐ ప్రెసిడెంట్


 ప్రైవేటు రంగాన్ని ఆకర్షిస్తుంది...
సరుకు రవాణా పాలసీని హేతుబద్ధీకరించడం, పీపీపీ విధానాన్ని సమీక్షిస్తామని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు కంపెనీలను ఆకర్షించేలా చేస్తుంది. దీనివల్ల రైల్వే రవాణా మెరుగుపడటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, పోర్టులతో అనుసంధాన్ని మరింత పెంచడం వంటివాటిపై దృష్టిపెట్టడం ఆహ్వానించదగిన విషయం. ఇది అత్యంత ఆచరణాత్మక బడ్జెట్. ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేలను వెన్నెముకగా మార్చాలన్న లక్ష్యం అత్యంత ప్రధానమైనది. అధునాతన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి  బడ్జెట్ బాటలు వేసింది. - హర్షవర్ధన్ న్యోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్


ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నా...
 పెట్టుబడి వ్యయాల విషయంలో రాజీపడకుండా... చార్జీల పెంపు కూడా లేకుండా రైల్వే శాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటి సామర్థ్యాలనూ పెంచే విధంగా చర్యలు ఉన్నా యి. కమోడిటీ రంగాల్లో తీవ్ర మందగమనం కారణంగా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు పొంచిఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్‌లో వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయం.
 - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement