ఒంగోలు: మోడీ ప్రభుత్వం తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే అన్ని తరగతుల రైల్వే ప్రయాణికులపైనా 14.2 శాతం, సరుకు రవాణాపై 6.5 శాతం భారీ భారం మోపిన సంగతి తెలిసిందే. అయితే ఆ భారం తమది కాదని కేవలం గత కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పుకున్నా జనం మాత్రం మోడీ పెంచిన భారమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడంతో ఈ బడ్జెట్లో అయినా జిల్లాకు న్యాయం జరుగుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ:
ఒంగోలు-దొనకొండ రైలు మార్గం జిల్లాలోని పశ్చిమప్రాంత వాసుల చిరకాల వాంఛ. ఈ రైల్వేలైన్ మంజూరైతే జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పశ్చిమ ప్రాంతానికి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతిసారీ మన నాయకులు ప్రతిపాదిస్తున్నా ఆదాయం రాదంటూ తిరస్కరిస్తున్నారు.
శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గంపై అనేకమార్లు సర్వేలు జరిగాయి. అధికారపక్షం చేతగానితనం వల్లే రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తేది. 2013-14 ఆర్థిక బడ్జెట్‌లో 50:50 శాతం వాటాతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వేలైనును అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చొరవతో అద్దంకి మీదుగా వెళ్లేలా డిజైన్ మారుస్తూ రైల్వే శాఖ అంగీకరించింది. అయితే మంత్రి ప్రకటించారే గానీ ఇంతవరకు దానికి సంబంధించిన ఎటువంటి యాక్షన్ ప్లాన్ అమలుకాలేదు. కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు.
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఒక ఎస్కలేటర్, రెండు లిఫ్టులకు నిధులు కూడా కేటాయించామని చెబుతున్నా ఇంతవరకు వాటి నిర్మాణం మొదలు కాలేదు.
ఒంగోలు రైల్వే కాలనీలు వర్షం పడినప్పుడు నీట మునుగుతున్నా వాటిని ఆధునికీకరించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపడంలేదు.
కరవది రైల్వే బ్రిడ్జి మరమ్మతులకు గురైంద ని నిత్యం దానిపై రైళ్లను నిదానంగా నడుపుతున్న రైల్వే అధికారులు పురాతన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు మాత్రం దృష్టి సారించకపోతుండడం గమనార్హం.
జిల్లాలోని చాలా రైల్వేస్టేషన్లలో తాగునీటి సమస్య ఉంది. ఒంగోలు రైల్వేస్టేషన్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మినరట్ వాటర్ ప్లాంటును ఏర్పాటుచేయాలని అధికారులు భావించినా ఇంత వరకు అతీగతీ లేదు.
రైల్వే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉన్నా వారికి సరైన వైద్య సదుపాయం అందడం లేదు. ఆస్పత్రి ఉన్నా సేవలు అంతంత మాత్రమే. స్పెషలిస్టు డాక్టర్లు సైతం లేరు. కనీసం సిక్ లీవ్ కావాలన్నా..విజయవాడ రైల్వే ఆస్పత్రికి వెళ్లి అక్కడి డాక్టర్ల అనుమతి తీసుకోవాల్సి రావడంతో జిల్లాలో రైల్వే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఒంగోలు ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని..అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని చేసిన ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు.
రైళ్లల్లో ప్రయాణికుల భద్రతకు కూడా సరైన ప్రణాళిక ఉండడం లేదు. కేవలం కొన్ని రైళ్లలో మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటున్నారు. సుదూర తీరం ప్రయాణించే రైళ్లలో ఇప్పటికీ భద్రతా సిబ్బంది ఉండడం లేదు. ఈ కారణంగానే ఇటీవల విజయవాడ- నెల్లూరు మధ్య పలు రైళ్లలో ప్రయాణికులను బెదిరించి దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు.
సరుకు రవాణాపై నిర్లక్ష్యం: విజయవాడ-గూడూరు మార్గంలో సరుకు రవాణా కూడా నిత్యం అధికంగానే ఉంటోంది. ఈ క్రమంలో రవాణా కోసం ప్రత్యేక ట్రాక్ వేయాలని ఎప్పుడో నిర్ణయించారు. కానీ అందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రకటించలేదు.
కొత్తరైళ్లు..రైల్వే స్టాపింగులపై నిర్లక్ష్యం..
ఒంగోలు, చీరాల తదితర రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని ఎన్నిసార్లు కోరినా రైల్వేశాఖ మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో జోథ్‌పూర్ రైలుకు స్టాపింగ్ ఏర్పాటు చేయాలని రాజస్థానీయులు కోరుతున్నారు. దీనివల్ల జిల్లాలో ఉన్న దాదాపు 35 వేల మందికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
గతేడాది విజయవాడ- చెన్నైకు డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ లాంఛనంగా ప్రయత్నించింది. ప్రయత్నం అయితే సక్సెస్ అయిందిగానీ డబుల్ డెక్కర్ రైలు మాత్రం పట్టాలెక్కలేదు. రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగే వరకు ముఖ్యమంత్రి సైతం వారంలో రెండు రోజులు విజయవాడలో ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడకు ప్రత్యేక రైళ్లు పెంచాల్సిన అవసరం ఉంది. చిత్తూరు- విజయవాడ మార్గంలోనే కాకుండా, గుంతకల్లు- గుంటూరు-విజయవాడ మార్గంలోను అదనపు రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త రైళ్లు లేకపోవడంతో.. రద్దీ సమయాల్లో రైళ్లు కిటకిటలాడుతూ ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నా రైల్వేశాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో అధికార పక్షంపై దుమ్మెత్తిపోసే తెలుగుదేశం పార్టీనే నేడు అధికారంలోకి వచ్చిన దృష్ట్యా ఈ బడ్జెట్‌లో ఏ మేరకు జిల్లాకు న్యాయం జరిగేలా చూస్తారోనని జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఆశలు పట్టాలెక్కేనా..
Published Tue, Jul 8 2014 2:34 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Advertisement