ఆశల రైలు ఆగేనా? | Railway Budget today | Sakshi
Sakshi News home page

ఆశల రైలు ఆగేనా?

Published Wed, Feb 24 2016 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

ఆశల రైలు ఆగేనా?

ఆశల రైలు ఆగేనా?

నేడు రైల్వే బడ్జెట్
పలు రైల్వే ప్రతిపాదనలు పెండింగ్

 
మరి కొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ కోసం హైదరాబాద్ మహానగరం కోటి ఆశలతో, ఆకాంక్షలతో  ఎదురు చూస్తోంది. అరకొర సౌకర్యాలు, చాలీచాలని రైళ్లు,  రైల్వేస్టేషన్‌లపై పెరిగిన ఒత్తిడి వంటి అనేక రకాల సమస్యలకు బడ్జెట్ రైలు బండి పరిష్కారాలను మోసుకొస్తుందా...లేక  నగరంలో కూత పెట్టకుండానే తుర్రుమంటుందా అని నగరవాసి సంశయం. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపై పెరుగుతున్న ఒత్తిడికి పరిష్కారంగా చర్లపల్లిలో నాల్గవ రైల్వే టర్మినల్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారా....ఎంఎంటీఎస్ రెండో దశ  ఈ ఏడాదైనా  వేగం పుంజుకుంటుందా...హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్లేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క ట్రైన్ అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా సాయినగర్ వరకు మరో రైలుకు ఈ బడ్జెట్‌లోనైనా  గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా... సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ట్రైన్ పట్టాలెక్కుతుందా, హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రెండో దశకు మార్గం సుగమమవుతుందా...ఇలా ఎన్నో, ఎన్నెన్నో సందేహాలు, ఆశలు. నగర వాసుల కోర్కెలను సురేష్‌ప్రభు నెరవేర్చుతారా..వేచి చూడాల్సిందే.     - సాక్షి,సిటీబ్యూరో
 
ఆశల ఊగిసలాట..!
నిరంతరం సిబ్బంది పర్యవేక్షణ.. అనుక్షణం ట్రాక్‌ల పరిశీలన.. ఎప్పుడూ ఎదురుగా ఎలాంటి అడ్డంకులు లేని ప్రయాణం.. తక్కువ ఖర్చు.. ఖర్చుకు తగ్గ సదుపాయాలు.. ఇంతకంటే సురక్షితం ఇంకేముంటుంది..! అందుకే ‘గ్రేటర్’ వాసులు అనుకూల ప్రయాణ సాధనంగా రైలుకే ఓటేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇతర అన్ని రకాల రవాణా సదుపాయాల కంటే రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. కోటికి చేరువైన మహానగర జనాభాలో 2015లో 9.12 కోట్ల మంది రైళ్లలోనే రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, పెరుగుతున్న ‘గ్రేటర్’ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే సేవలు మాత్రం విస్తరించడం లేదు. ఇంకొద్ది గంటల్లో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్రేటర్’ రైల్వే అవసరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో
 
సికింద్రాబాద్ ఆధునికీకరణ నిల్..

పెరుగుతున్న ప్రయాణికులు.. మహానగరంలో దశాబ్దకాలంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో నగర జనాభా 60.11 లక్షలు ఉంటే రైళ్ల సంఖ్య సుమారు 150 ఉండేది. వీటిలో ప్రతిరోజు సుమారు లక్షా 30 వేల మంది ప్రయాణించారు. 2012లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 1.69 లక్షలకు పెరిగారు. ట్రైన్ సర్వీసుల సంఖ్యను 150 నుంచి 200కు పెంచారు. ప్రస్తుతం ప్రతిరోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్, ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ సహా 250 ట్రైన్ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, దశాబ్దాలకు పైగా రైల్వే ప్రాజెక్టులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రతి రోజు వేలమందితో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉంది. విస్తరిస్తున్న నగర శివార్లను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాల్సిన టెర్మినళ్లు కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది.
 
ప్రతిపాదనలోనే కాచిగూడ ఫ్లాట్‌ఫామ్
ప్రతిరోజు సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగించే కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐదు ఫ్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి పిట్‌లైన్ కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగింటిపై తీవ్ర రైళ్ల ఒత్తిడి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 6వ ఫ్లాట్‌ఫామ్ నిర్మించాలని రెండు సంవత్సరాల క్రితం ప్రతిపాదించారు. కానీ ఆచరణకు నోచలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కోసం 2010 నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తునే ఉన్నారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేషన్ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు అటకెక్కాయి. ప్రస్తుతం ఉన్న 10 ఫ్లాట్‌ఫామ్‌ల పైనా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సికింద్రాబాద్‌కు ప్రత్యామ్నాయంగా రెండేళ్ల క్రితం మౌలాలి స్టేషన్‌ను విస్తరించాలని నిర్ణయించారు. కాగా, ఆ పనులు అటకెక్కాయి. తాజాగా చర్లపల్లి స్టేషన్‌ను అతిపెద్ద రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందో తెలియదు.
 
నత్తనడకన రెండో దశ..

సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. మూడేళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రక్షణశాఖ నిరాకరించడం వల్ల ఏడాది క్రితం సనత్‌నగర్- మౌలాలీ మార్గంలో 5 కిలోమీటర్ల మేరకు బ్రేక్ పడింది. ఇప్పటికీ తిరిగి పనులు ప్రారంభం కాలేదు. ఉందానగర్- శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండో దశ విస్తరణపై ఎలాంటి పురోగతి లేదు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు రెండో దశను పొడిగించాలని ఇటీవల సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరిన దృష్ట్యా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే  ఈ బడ్జెట్‌లోనైనా అడ్డంకులు తొలగి ప్రాజెక్టు సాఫీగా సాగుతుందా లేదా వేచి చూడాల్సిందే.
 
కొండెక్కిన కొత్త రైళ్లు..
2013లో ప్రకటించిన సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్, 2014లో ప్రకటించినహైదరాబాద్- గుల్బర్గా ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటికీ ప్రారంభానికి నోచలేదు.సికింద్రాబాద్- షిర్డీకి ప్రస్తుతం అజంత- మన్మాడ్ ఒక్కటేఅందుబాటులో ఉంది. మరో ట్రైన్ కోసం ప్రయాణికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణోమాత ఆలయానికి వెళ్లేందుకు సికింద్రాబాద్- కాట్రాకు ట్రైన్నడపాలనే డిమాండ్ ఉంది.కాచిగూడ నుంచి బెంగళూర్‌కు ప్రస్తుతం 2 రైళ్లే నడున్నాయి. ప్రయాణికుల ర ద్దీ దృష్ట్యా మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది.
 
‘లింకు’ తెగిన ఎంఎంటీఎస్- సిటీ బస్సు
మహానగరంలో 2003లో ఎంఎంటీఎస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రెండోదశ పనులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా సిటీ బస్సుకు, ట్రైన్‌కు లింకు ఏర్పాటు కాలేదు. అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు బస్సులు నడిచే ఏర్పాట్లు చేయాలని చేసిన ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సగానికి పైగా స్టేషన్లకు కనీస రోడ్డు సదుపాయం లేదు. రైలు దిగిన ప్రయాణికులు ఆటో ఎక్కాలన్నా, బస్సెక్కాలన్నా ఫర్లాంగుల కొద్దీ నడవాల్సిందే. ఫలక్‌నుమా, మలక్‌పేట్, లక్డీకాపూల్, నెక్లెస్‌రోడ్డు, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ తదితర స్టేషన్లకు రోడ్డు సదుపాయం ఉన్నా ఎంఎంటీఎస్ రాకపోకలకు అనుగుణంగా సిటీ బస్సులు అందుబాటులో ఉండవు. ఇక ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా స్టేషన్లకు రోడ్డు రవాణా సదుపాయం లేదు.
 
బడ్జెట్ తర్వాత రైల్వే ప్రైవేటు పరం..
పెండింగ్‌లో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లోనే నిధులు రావాలి. కరీంనగర్, పెద్దపల్లిలో అనేక సమస్యలున్నాయి, ఈ యేడాది బడ్జెట్‌లోనైనా వాటికి పరిష్కారం చూపాలి. బడ్జెట్ అనంతరం రైల్వే వ్యాపార వ్యవస్థగా మారబోతుంది. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు రైల్వేను ముక్కలు చేసి కార్పొరేట్లకు అప్పజెప్పడానికి మార్గం సుగుమం చేస్తున్నారు. 400 రైల్వే స్టేషన్లు ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడానికి టెండర్లు వేశారు. ఇక రైల్వేను ప్రైవే టుకు ఇచ్చి రైళ్లను నడపడానికి అనుమతి ఇచ్చేస్తారు. ప్రజల కోసం మాని లాభాల కోసం రైళ్లు నడపాలని సర్కారు భావిస్తుంది.     
 - కె. శివకుమార్, ఎస్సీఆర్‌ఎంయూ డివిజనల్ కార్యదర్శి
 
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి..
2016-17 రైల్వే బడ్జెట్ ద్వారా పెండింగ్‌లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. కొంత కాలంగా రైల్వే ప్రాజెక్ట్‌లు పూర్తవలేదు. అక్కన్నపేట్, మెదక్ మధ్య 17 కిలోమీటర్లు పూర్తి చేయాలి. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా చాలా ఏళ్ల నుంచి ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లు కూడా పూర్తి చేసే విధంగా కేంద్రం నిధులు ఈ బడ్జెట్‌లోనే  కేటాయించాలని కోరుతున్నాం. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలకు నిధులు విడుదల చేసి, గ్రూప్-డి, యాక్ట్ యాప్ ఉద్యోగాలలో స్థానికులకు 80 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ను జనవరి నుంచి అమలు చేయాలి. రైల్వేలో బిబేక్ దేబ్రాయ్ కమిటీ రిపోర్ట్‌ను రద్దు అమలు చేయవద్దని కోరుతున్నాం.
 - బి. ముత్తయ్య,
 ైరె ల్వే జేఏసీ చైర్మన్
 
హంగులు లేని నాంపల్లి..
నాంపల్లి రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో, పర్యాటక హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశవిదేశీ పర్యాటకులకు హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని తెలిపే విధంగా స్టేషన్‌ను సమాచార కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఇప్పటికీ కాగితాల్లోనే ఉంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయలేదు. స్టేషన్ విస్తరణ అటకెక్కింది. ఆరు ఫ్లాట్‌ఫామ్‌లు దాటాలంటే మెట్ల మార్గమే గత్యంతరం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement