రైల్వే షేర్లు... ఏ రూటు..? | which route as railway budget..? | Sakshi
Sakshi News home page

రైల్వే షేర్లు... ఏ రూటు..?

Published Thu, Feb 25 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

రైల్వే షేర్లు... ఏ రూటు..?

రైల్వే షేర్లు... ఏ రూటు..?

పట్టాలు తప్పుతాయా ? దూసుకెళ్తాయా?
న్యూఢిల్లీ: వనరులు పరిమితంగానూ, ఆకాంక్షలు ఆకాశంలో ఉన్న పరిస్థితుల్లో రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  తన రెండో బడ్జెట్‌లో సురేశ్ ప్రభు మెరుపులు మెరిపిస్తారా? అరకొర చర్యలతోనే సరిపెడతారా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.  రైల్వేల ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడం, వ్యయాలు మాత్రం అంచనాలనుమించి పోయిన నేపథ్యంలో  తన రెండో రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల, రవాణా చార్జీలు పెంచాలా వద్దా అనే సందిగ్ధతలో రైల్వే శాఖమంత్రి సురేశ్ ప్రభు ఉన్నారు. ఈ నేపథ్యంలో వస్తోన్న రైల్వే బడ్జెట్ కారణంగా  రైల్వే సంబంధిత షేర్లు ఎలా స్పందిస్తాయి ? దూసుకుపోతాయా? లేక పట్టాలు తప్పుతాయా ? ఒక విహంగ వీక్షణం.

 రైల్వే బడ్జెట్‌ను నేడు(గురువారం) రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. సాధారణంగా రైల్వే బడ్జెట్‌కు ముందు రైల్వేలతో సంబంధమున్న షేర్లు పెరగడం రివాజు. కానీ ఈ సారి రైల్వే షేర్లు పట్టాలు తప్పుతున్నాయి. ఒకటి, అరా తప్ప చాలా రైల్వే సంబంధిత షేర్లు కుదేలవుతున్నాయి. ముడి చమురు ధరల క్షీణతతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుండటంతో ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పై పడుతోంది. మొత్తంమీద స్టాక్ మార్కెట్ పతనదిశగా వుండటంతో ఈ దఫా రైల్వే షేర్లు మెరుపులు మెరిపించలేకపోతున్నాయి.  అయితే ఈసారి రైల్వే కేటాయింపులు భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. రైల్వేల మూలధన కేటాయింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20-25 శాతం వృద్ధితో రూ.1.25 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా.

రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భద్రత, రైల్వే లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్,  యార్డ్‌ల ఆధునీకరణకు సముచిత రీతిలో కేటాయింపులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలను పెంచొచ్చని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ పేర్కొంది. కాగా బడ్జెట్ నేపథ్యంలో రైల్వే స్టాక్‌లు బుధవారం మిశ్రమంగా స్పందించాయి. కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ 3%, టిటాఘర్ వ్యాగన్స్ 2.6 శాతం టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ 1.8 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ ఇంజనీర్స్ 1.6 శాతం చొప్పున పడిపోయాయి. హింద్ రెక్టిఫైర్స్ 3.4 శాతం, స్టోన్ ఇండియా 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. నేటి రైల్వే బడ్జెట్ నేపథ్యంలో అందరి దృష్టి పడే కొన్ని రైల్వే షేర్ల వివరాలు..

 బీఈఎంఎల్: 1964లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ రంగ కంపెనీ రైల్వే కోచ్‌లు, రైల్వే విడిభాగాలు, మైనింగ్ పరికరాలను తయారు చేస్తోంది.
కాళింది రైల్ నిర్మాణ్ (ఇంజనీర్స్): రైల్వే రంగానికి సంబంధించి ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్రక్షన్(ఈపీసీ) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రైల్ రవాణా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, ట్రాక్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి రైల్వే మౌలిక సదుపాయాలను అందిస్తోంది.
ఆల్‌స్టోమ్ టీ అండ్ డీ: విద్యుదుత్పత్తి, విద్యుత్ ప్రసారం,రైల్వే మౌలిక సదుపాయాల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అధిక, మధ్య తరహా సామర్థ్యమున్న వోల్టేజ్ స్టేషన్లను నిర్మించడం, పవర్‌గ్రిడ్ నిర్వహణ టెక్నాలజీలను డెవలప్ చేస్తోంది.
సీమెన్స్: వివిధ పరిశ్రమలకు కనెక్టింగ్ సొల్యూషన్లను అందిస్తోంది. రైల్వే  సిగ్నలింగ్, భద్రత వ్యవస్థలు, ట్రాఫిక్ నియంత్రణ, ఆటోమేషన్, ఎలక్ట్రిఫికేషన్, లోకోమేటివ్‌ల ట్రాక్షన్ ఎక్విప్‌మెంట్ తదితర సేవలందిస్తోంది.
హింద్ రెక్టిఫైర్స్: రైల్వే రవాణాకు సంబంధించిన పరికరాలతో పాటు పవర్ సెమి కండక్టర్లు, పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ పై పరిశోధన, తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ధర రూ.68
టిటాఘర్ వ్యాగన్స్: రైల్వే వ్యాగన్‌లు, బెయిలీ బ్రిడ్డ్‌లు, మైనింగ్ రంగానికి ఉపయోగపడే భారీ పరికరాలతోపాటు. రక్షణ రంగానికి స్పెషల్ వ్యాగన్లు, షెల్టర్లను, ఇతర ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తోంది.
టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్: రైల్వే రవాణా కార్లు, హైడ్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్‌లు తయారు చేస్తోంది.
స్టోన్ ఇండియా: రైల్వేలకు సంబంధించిన బ్రేక్ సిస్టమ్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ.  రైల్ రహదారి పరిశ్రమకు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను అందిస్తోంది.

 ఏతావాతా...
రైల్వేలకు పెట్టుబడులు పెంచితే సీమెన్స్, బీఈఎంఎల్, టెక్స్‌మాకో, టిటాఘర్ వ్యాగన్స్, టిమ్‌కెన్ షేర్లు లాభపడతాయి.
రైల్వేల ఆధునీకరణ, రైల్వే, మెట్రోల విస్తరణకు అధిక నిధులు వస్తే బీఈఎంఎల్ లాభపడవచ్చు.
రైల్వేల మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కల్పిస్తే టిటాఘర్ వ్యాగన్స్ షేర్ పెరగవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement